ఇంటర్నెట్‌లో అమ్మభాషనే కోరుకుంటున్న 92 శాతం తెలుగువారు: గూగుల్ అధ్యయనంలో వెల్లడి - ప్రెస్ రివ్యూ

తెలుగు కోరుకుంటున్న 92 శాతం నెటిజన్లు

ఫొటో సోర్స్, WTCHYD2017/TWITTER

92 శాతం మంది నెటిజన్లు తెలుగే కోరుకుంటున్నట్లు గూగుల్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

ఇంటర్‌నెట్‌ వినియోగించే తెలుగువారంతా.. తమకు తెలుగులోనే సమాచారం కావాలని కోరుకుంటున్నారు.

మాతృభాషలో టైపింగ్‌ కోసం తెలుగు కీబోర్డులను వినియోగిస్తున్నారు. గూగుల్‌ సేవలను అమ్మ భాషలోనే పొందుతున్నారు.

వికీపీడియా సమాచారం మాతృభాషలోనే చదవడానికి ఇష్టపడుతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్న తెలుగువారిలో 92 శాతం మందిది ఇదే ఆకాంక్ష అని గూగుల్‌ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

దీంతో ఇంటర్‌నెట్‌ దిగ్గజ సంస్థలు తెలుగుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్‌ ఇప్పటికే ముందుండగా.. వికీపీడియా, ఇతర సంస్థలూ ఇదే బాటలో పయనిస్తున్నాయి.

తెలుగువారికి దగ్గరవ్వాలంటే తెలుగుకు దగ్గరవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఈ పరిణామాలు ఇంటర్‌నెట్‌లో తెలుగుకు మరింత వెలుగు ఇస్తున్నాయి.

2016 చివరి నాటికి 4 కోట్ల మంది తెలుగువారు ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నట్టు గూగుల్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

2019 నాటికి ఈ సంఖ్య 7 కోట్లకు చేరింది. మాతృభాషల వినియోగంపై తాజాగా గూగుల్‌ మరో సర్వే చేయగా సగటున ప్రతి 10 మంది భారతీయ వినియోగదారుల్లో 9 మంది గూగుల్‌లో తమ తమ భాషల్లోని సమాచారం కోసమే వెతుకుతున్నారని వెల్లడైందని చెప్పింది.

భారతీయ భాషలు వాడేవారిలో 88 శాతం మంది తమ భాషల పట్ల ఆసక్తి చూపిస్తుండగా.. తెలుగులో ఈ సంఖ్య మరింత అధికంగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది.

ఇతర భాషల్లో ఇది 88శాతం ఉండగా, తెలుగులో 92 శాతం మంది ఉండటం గమనార్హం. ఈ ఫలితాల నేపథ్యంలో గూగుల్‌ తెలుగు వారికి మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆంధ్రజ్యోతి కథనం వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

భారత జట్టులోకి వచ్చిన బుమ్రా

శ్రీలంకతో టీ20, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును ఎంపిక చేసినట్లు ఈనాడు సహా అన్ని ప్రధాన పత్రికలూ కథనం ప్రచురించాయి.

గాయం కారణంగా మూడు నెలలు జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడని చెప్పింది.

ఫిట్‌నెస్ సాధించిన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. వెన్నునొప్పి కారణంగా బుమ్రా కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

భారత జట్టు ఫిజియో నితిన్ పటేల్ పచ్చజెండా ఊపడంతో అతడు గుజరాత్ తరఫున సూరత్‌లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడనున్నాడు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధవన్ కూడా రెండు జట్లలోకి వచ్చాడు.

టీ20 జట్టు నుంచి రోహిత్ శర్మ, మహమ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చారు. "ఈ ఏడాది రోహిత్ 47 మ్యాచ్‌లు ఆడాడు, రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలనేది ఎప్పటినుంచో అనుకుంటున్నదే" అని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పినట్లు ఈనాడు రాసింది.

శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 5న, ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 14న ప్రారంభం అవుతాయి. ఆసీస్‌తో పోరుకు ముగ్గురు ఓపెనర్లు రోహిత్, రాహుల్, ధవన్‌లు అందుబాటులో ఉన్నారని ప్రసాద్ చెప్పాడు.

దీపక్ చాహర్ వెన్నుగాయానికి గురై ఐపీఎల్ ఆరంభం వరకూ క్రికెట్‌కు దూరంకాగా, నవదీప్ సైని జట్టులో కొనసాగనున్నాడు. గాయం నుంచి కోలుకోని హార్ధిక్ పాండ్య జట్టుకు ఎంపిక కాలేదు.

ధోని సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడా అని అడగగా "ఆ విషయం గురించి నేనిప్పుడు మాట్లాడలేను. సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండాలంటే, ముందు అతడు ఆడాలి" అని ప్రసాద్ చెప్పినట్లు ఈనాడు రాసింది.

భారత టీ20 జట్టు (శ్రీలంకతో సిరీస్)- విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జడేజా, శివమ్ దూబె, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్.

భారత వన్డే జట్టు (ఆస్ట్రేలియాతో సిరీస్): విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, కుల్దీప్, చాహల్, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్, బుమ్రా.

ఫొటో సోర్స్, facebook/Andhra Pradesh CM

మూడేళ్లలో కడప ఉక్కు: ఏపీ సీఎం జగన్

కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని జగన్ చెప్పారు.

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద సోమవారం ఉదయం కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు.

జిల్లాలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమన్నారు.

"రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని, నీరు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే విషయం తెలిసిన వ్యక్తి, మీ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా రాయలసీమ ఆర్థిక, ఉద్యోగాల చరిత్రను మార్చేందుకు 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నామని సగర్వంగా చెబుతున్నా" అని జగన్ అన్నారని సాక్షి చెప్పింది.

ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ పరిశ్రమకు ముడిసరుకు అందించేందుకు ఎన్‌ఎండీసీ (నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇందుకు ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ అన్నారు.

ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు తప్పకుండా ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కట్టిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఇది కూడా చేస్తామని చెప్పారు. ఐదేళ్లు ఎదురు చూసినా న్యాయం జరగలేదు.

దేవుడి దయ, అందరి చల్లని దీవెనలతో ఈ రోజు కడపతోపాటు రాయలసీమ జిల్లాలకు న్యాయం జరిగే రోజులు మళ్లీ వచ్చాయని జగన్ అన్నట్లు సాక్షి రాసింది.

తెలంగాణలో పురపోరు

కొత్త ఏడాదిలో తెలంగాణ మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదలచేసింది. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్టయింది.

120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులు, 10 కార్పొరేషన్లలోని 385 వార్డులకు జనవరి 22న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారని కథనంలో చెప్పారు.

జనవరి 7న రాష్ట్రస్థాయిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుండగా.. మరుసటి రోజు 8న జిల్లా, మున్సిపాలిటీల్లో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. అదేరోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.

తెలంగాణ ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను మరింత కుదించింది. నోటిఫికేషన్‌ వెలువడిన ఇరవై రోజుల్లోపే ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.

పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ఎస్‌ఈసీ.. పురపోరు వ్యవధిని మరింత తగ్గించింది. నామినేషన్ల స్వీకరణను మూడురోజులకే పరిమితం చేసింది.

జనవరి 8న ఉదయం 10.30 గంటలకు మున్సిపాలిటీల్లో రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చి, నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.

వార్డులవారీగా తుది ఓటరు జాబితాను వచ్చేనెల 8వ తేదీనే విడుదల చేయనుండటంతో.. ఔత్సాహిక అభ్యర్థులు జాబితాను పరిశీలించడంతోపాటు, ప్రతిపాదకులు, బలపర్చే అభ్యర్థుల ఓట్లను సరిచూసుకుని నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. 11న నామినేషన్లను పరిశీలించి సక్రమంగా ఉన్నవాటిని ప్రకటిస్తారని పత్రిక రాసింది.

14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించి, సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుదిజాబితా ప్రకటిస్తారు.

15న ఉదయం నుంచి అభ్యర్థుల ప్రచారం మొదలవుతుంది. నిబంధనల ప్రకారం జనవరి 20న సాయంత్రం 5 గంటల కల్లా ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది.

జనవరి 22న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్‌ జరుగుతుంది. అనివార్య కారణాలతో పోలింగ్‌ రద్దయినా, వాయిదాపడినా 24న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.

జనవరి 25న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని నమస్తే తెలంగాణ కథనం వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)