హాజీపూర్ హత్యల కేసు విచారణ జనవరి 3కు వాయిదా వేసిన కోర్టు - ప్రెస్ రివ్యూ

హాజీపూర్

హాజీపూర్‌ బాలికల వరుస హత్యల కేసులో నిందితుడు తాను ఏ నేరమూ చేయలేదని కోర్టు ముందు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్త రాసింది. జడ్జి అడిగిన ప్రశ్నలకు.. 'కావచ్చు... నాకేమీ తెలియదు.. అంతా అబద్ధం..' అంటూ ఒకే తీరుగా సమాధానాలు ఇచ్చినట్లు పేర్కొంది.

యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారం, హత్య కేసును నల్లగొండ జిల్లా మొదటి అదనపు సెషన్స్‌ న్యాయస్థానం (పోక్సో కోర్టు) విచారిస్తోంది. గురువారం జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు ఏ ఆందోళనా లేకుండా సమాధానాలు చెప్పాడు.

అభియోగాలు, సాక్ష్యాలు, సాక్షులు తెలిపిన వివరాలను తెలియజేసిన న్యాయమూర్తి.. ''వాటిపై నీ సమాధానం ఏమిటి?'' అని నిందితుడిని ప్రశ్నించారు. జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకూ ''కావచ్చు.. నాకేమీ తెలియదు.. అంతా అబద్ధం'' అని నిందితుడు ఒకే తీరుగా సమాధానాలు ఇచ్చాడు.

కోర్టు విచారణ ఇలా సాగింది.

జడ్జి: డిగ్రీ విద్యార్థిని కేసులో నీకు వ్యతిరేకంగా 29 సాక్ష్యాలున్నాయి.. నువ్వేమంటావు?

నిందితుడు: అవన్నీ అబద్ధాలే. అసలు ఈ కేసులతో నాకేం సంబంధం లేదు. హత్యకు గురైన బాలిక ఎవరో నాకు తెలియదు.

జడ్జి: బావిలోంచి తీసిన ఎముకలు, దుస్తులు ఆమెవేనా?

నిందితుడు: కావొచ్చు (ముక్తసరిగా)

జడ్జి: హత్య, అత్యాచారానికి గురైన విద్యార్థిని తెలుసా?

నిందితుడు: నాకేమీ తెలియదు.

జడ్జి: లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేసిన వ్యక్తి, ఇతర సాక్షులు నీకు తెలుసా?

నిందితుడు: తెలియదు.

జడ్జి: దర్యాప్తు అధికారి ముందు నువ్వు నేరం చేసినట్లు అంగీకరించావు కదా?

నిందితుడు: అన్నీ అబద్ధాలే.

జడ్జి: యాదాద్రి జిల్లా వైద్యులు నీకు లైంగిక పటుత్వం ఉన్నట్లు నిర్ధారించారు కదా?

నిందితుడు: అన్నీ అబద్ధాలే.

జడ్జి: బాలికల దుస్తులపై ఉన్న వీర్యం, రక్తపు మరకల ఆనవాళ్లు నీవేనని ఫోరెన్సిక్‌ రిపోర్టులో తేలింది. నువ్వేమంటావు?

నిందితుడు: అలా ఎస్‌వోటీ (రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం) పోలీసులు తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించి ఉంటారు.

జడ్జి: నువ్వు పోర్న్‌ వీడియోలు చూసేవాడివా?

నిందితుడు: నా దగ్గర అసలు స్మార్ట్‌ఫోనే లేదు.

జడ్జి: కర్నూలులో మహిళ హత్యతో నీకు సంబంధం ఉందా?

నిందితుడు: అసలు ఆ మహిళ ఎవరో నాకు తెలియదు.

జడ్జి: నీ తరఫున మాట్లాడేందుకు ఎవరైనా ఉన్నారా?

నిందితుడు: నా కుటుంబ సభ్యుల (తల్లిదండ్రులు, అన్న)ను సాక్షులుగా పిలిపించుకుంటా.

దాదాపు గంటన్నరపాటు కోర్టులో నిందితుడి ఎగ్జామినేషన్‌ సాగింది. డిగ్రీ విద్యార్థిని హత్య, అత్యాచారం కేసులో సాక్ష్యాలపై నిందితుడి వాదనలు విన్న న్యాయస్థానం.. మరో ఇద్దరి హత్య, అత్యాచార కేసుల విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

'దిశ' చట్టం అమలు కోసం ఏపీలో ఓ ఐపీఎస్‌

'దిశ' చట్టం అమలు కోసం ప్రత్యేకంగా ఓ ఐపీఎస్‌ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

రాష్ట్రంలోని 18 మహిళా పోలీసుస్టేషన్లను, 'దిశ' చట్టం అమలు కోసం నియమించే అధికారి పరిధిలోకి తీసుకొచ్చేలా ఆలోచన చేయాలని జగన్ అన్నారు. 'దిశ' యాప్‌ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.

'దిశ' చట్టం అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని 18 మహిళా పోలీసుస్టేషన్లలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలు, నలుగురు సహాయ సిబ్బందిని నియమించడంతో పాటు వాటిని ఉన్నతీకరించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రతిపాదించగా సీఎం అంగీకారం తెలిపారు.

ఆ పోలీసుస్టేషన్లలో మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాల కోసం నిధులు మంజూరు చేస్తామని అన్నారు. 13 జిల్లాల్లోనూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని ఆదేశించారు.

''విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో కొత్త ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తాం. వన్‌స్టాప్‌ సెంటర్లలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా ఒక మహిళా ఎస్సైని నియమిస్తాం. 'దిశ' చట్టంలో భాగంగా 13 జిల్లాల్లో ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు అవసరమైన నిధులను వారం రోజుల్లో డిపాజిట్‌ చేయాలి'' అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images

వరవరరావు హార్డ్‌డిస్క్‌ డేటా రికవరీ కోసం ఎఫ్‌బీఐ సాయం..

ఎల్గార్‌ పరిషద్‌- మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టైన విరసం నేత వరవరరావు ఇంట్లో స్వాధీనంచేసుకున్న హార్డ్‌డిస్క్‌లోని డేటా రికవరీ కోసం అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) సాయం తీసుకునే యోచనలో పుణె పోలీసులు ఉన్నట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త రాసింది.

గతేడాది ఆగస్టులో వరవరరావు ఇంట్లో సోదాల్లో లభ్యమైన హార్డ్‌డిస్క్‌లో ఏముందో తెలుసుకునేందుకు పుణె పోలీసులు నాలుగు ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీలకు పంపినా ఫలితం లేదు.

తొలుత పుణెలోని ల్యాబొరేటరీకి పంపగా, నిపుణులు హార్డ్‌ డిస్క్‌లోని డేటాను రికవరీ చేయలేకపోయారని ఓ అధికారి చెప్పారు. ముంబైలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపినా అక్కడి నిపుణులు డేటా సంపాదించలేకపోయారు.

గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీల నిపుణులు కూడా రికవరీ చేయలేకపోయారని పేర్కొన్నారు.

''సాంకేతికతలో ఎఫ్‌బీఐ చాలా పురోగతి చెంది ఉంటుంది. అందుకే ఎఫ్‌బీఐకి హార్డ్‌ డిస్క్‌ పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర హోం శాఖ ఇచ్చింది'' అని ఆ అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, rss.org

'CAAకు అనుకూలంగా ప్రచారం చేయాలి'

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు అనుకూలంగా ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు తమ శాఖల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ సంస్థ అధిపతి మోహన్ భాగవత్ ఆదేశించినట్లు వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

''సీఏఏ వల్ల దేశానికి జరిగే మేలు, సమాజానికి ఇది ఎలా ఉపయోగపడుతుందనేది ప్రచారం చేయాలి. పల్లె, పల్లెనా ప్రజల్లో చైతన్యం తేవాలి'' అని ఆర్‌ఎస్ఎస్ సభ్యులకు భాగవత్ సూచించారు.

హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో మూడు రోజుల 'విజయ సంకల్ప శిబిరం' గురువారం 'సమారోప్' కార్యక్రమంతో ముగిసింది.

సామాజిక సేవా కార్యక్రమాలు, గో సంరక్షణ, హిందూ ధర్మ ప్రచారం, కుటుంబ వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ వంటివాటిపై దృష్టి పెట్టి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని భాగవత్, ఇతర ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య నేతలు సూచించారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)