రాజధాని అమరావతి ఒక్క అంగుళం కదిలినా ప్రజలు, బీజేపీ చూస్తూ ఊరుకోవు: సుజనా చౌదరి - ప్రెస్ రివ్యూ

  • 30 డిసెంబర్ 2019
Image copyright FB/yschowdary

"రాజధాని అమరావతి ఒక్క అంగుళం కదిలినా ప్రజలు, బీజేపీ చూస్తూ ఊరుకోవు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించే ఈ మాట చెప్తున్నా" అని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

రాజధాని తరలింపు విషయంలో కేంద్రం అంగీకారం ఉందన్న వైసీపీ వర్గాల మాటలకు అర్థం లేదని, ఇలాంటి మూడు రాజధానుల పనికి ఎవరైనా మద్దతిస్తారా అని ఆయన ప్రశ్నించారు.

రాజధాని రైతులకు మద్దతు తెలిపేందుకు ఆదివారం అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించారు. మొదట మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పూజలు నిర్వహించారు. అనంతరం తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ప్రసంగించారు.

'రాజధాని రైతులారా, ఇది మీ ఒక్కరి సమస్య కాదు. ఇది రాష్ట్ర సమస్య. ఆధైర్య పడొద్దు. తాడిని తన్నేవాడు ఇక్కడ ఉంటే... తలను తన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు. చూస్తూ ఊరుకోం'' అని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఒక ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి మరో ప్రభుత్వం కుదరదంటే కోర్టులు చూస్తూ కూర్చోవన్నారు.

రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకునేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయని ఆయన పేర్కొన్నారు.

"రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం చెప్పింది. నాడు అసెంబ్లీలో జగన్‌, వైసీపీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలతో సహా అంతా అమరావతి రాజధాని అని ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలా పంపాకే రాజధానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది. 130 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో భూములు కొన్నాయి. అన్నింటికీ మించి రైతులు త్యాగాలు చేశారు. దాదాపుగా పూర్తికావస్తున్న రాజధానిని ఇప్పుడు తరలిస్తామనేందుకు వీలులేదు. అలా తరలిస్తే అది దేశ వృద్ధిరేటుపైనా ప్రభావం చూపిస్తుంది. కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయి. అవేంటో అవసరమైన సందర్భంలో చెప్తాం" అని సుజనా స్పష్టం చేశారు.

రాజధాని మారదన్న సుజనా చౌదరి వ్యాఖ్యలపై ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో స్పందిస్తూ- ఆయన వ్యాఖ్యలు శాసనం, వేదం కావన్నారని ఈనాడు తెలిపింది. ఆయనకేమైనా ప్రధాని నరేంద్ర మోదీ చెవిలో చెప్పారా అని ప్రశ్నించారు.

Image copyright Namaste Telangana

ఆదిలాబాద్ అడవుల్లో జత కోసం పెద్దపులి చక్కర్లు

ఆరడుగుల పొడవు.. నాలుగు అడుగుల ఎత్తుతో దృఢంగా ఉన్న పెద్దపులి ఒకటి యుక్తవయసులో జత కోసం ఆదిలాబాద్‌ అడవుల్లో జోరుగా చక్కర్లు కొడుతోందని నమస్తే తెలంగాణ తెలిపింది. కవ్వాల్‌ అభయారణ్యం పరిధిలోని కోర్‌ ఏరియాతోపాటు మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్‌, చెన్నూరు అడవుల వరకు దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ పులి కలియతిరుగుతోందని చెప్పింది.

భారీ ఆకారంలో చలాకీగాఉన్న ఈ పెద్దపులికి అటవీ అధికారులు ఏ-1 అనే పేరు పెట్టారు. ఇది మహారాష్ట్ర తడోబా అడవుల నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు. మహారాష్ట్ర తడోబా, అంధేరీ పెద్దపులుల అభయారణ్యం మొదలుకుని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వరకు ఉన్న పులుల్లో ఇది అందమైన, అత్యంత బలిష్టమైన పులి అని అధికారులు చెబుతున్నారు.

మూడు నుంచి నాలుగేండ్ల మధ్య వయసున్న ఈ పులి పలు చోట్ల స్థానికుల కంటపడింది. దీని సంచారంతో కవ్వాల్‌ అభయారణ్యం, చెన్నూరు డివిజన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. అడుగుజాడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి ఎలాంటి అపాయం జరుగకుండా జాగ్రత్తపడుతున్నారు.

ఈ పులి వేటలో ఆరితేరిందని అధికారులు గుర్తించారు. ఇది మంచిర్యాల జన్నారం అటవీ డివిజన్‌లో జన్నారం దండేపల్లి అడవుల గుండా మందమర్రి వైపు వెళ్తున్నప్పుడు కొందరు స్థానికులు ఫొటో తీశారు.

12 గంటల్లో 25 వేల వడలు

మహారాష్ట్రలో అంతా ఇష్టంగా తినే బటాటా వడలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తేవాలన్న ఆలోచన ఠాణే జిల్లాకు చెందిన కొంతమంది వంటగాళ్లకు వచ్చిందని, వెంటనే గరిటె తిప్పేందుకు ఓ 100 మంది సిద్ధమై, 12 గంటల్లో 25 వేల వడలు వేశారని ఈనాడు తెలిపింది.

దోంబివలి పట్టణంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ వడలు వేయిస్తూనే ఉన్నారు. అలుపు ఎరగకుండా మొత్తం 25వేల వడలను వేయించారు.

ఈ విషయం లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు అధికార బృందానికి ముందే తెలియడంతో వారు కూడా వచ్చి వంటగాళ్ల పనితనాన్ని గమనించారు. దీనిని లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చేర్చాలా వద్ద అన్నది త్వరలోనే తేలుస్తామని చెప్పారు.

ఈ వడలు చేయడానికి 1500కేజీల ఆలుగడ్డలు, 500లీటర్ల నూనె, 350కేజీల పిండి వాడారు. రూ.10 లక్షలు ఖర్చుపెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు