భారత క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణ కేంద్రాల్లో లైంగిక వేధింపులు: ప్రెస్ రివ్యూ

  • 16 జనవరి 2020
Image copyright Getty Images

భారత క్రీడా ప్రాధికార సంస్థలో యువతులపై లైంగిక వేధింపులు తీవ్రంగా ఉన్నాయంటూ 'ఇండియన్ ఎక్స‌్‌ప్రెస్' కథనం తెలిపింది.

''ఆరేళ్ల కిందట 2014 జనవరిలో హిసార్‌లోని భారత క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణ కేంద్రంలో అయిదుగురు బాలికలు తమ కోచ్‌పై ఫిర్యాదు చేశారు. ప్రపంచ ముద్దుల దినోత్సవం పేరుతో తమను పట్టుకుని ముద్దులు పెట్టాడంటూ వారు ఆరోపించారు.

వారు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడి గ్రామపంచాయతీ జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు.

అక్కడికి మూడేళ్ల తరువాత విచారణ కమిటీ ఆ కోచ్ దోషేనని తేల్చింది.

గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ నిర్వహణలోని 24 క్రీడా శిక్షణ కేంద్రాల్లో 45కి పైగా లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. ఇందులో 29 ఘటనల్లో కోచ్‌లపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సంపాదించింది.

వీటిలో కొన్నిటిపై విచారణ జరిగి దోషులను గుర్తించినా వారిని బదిలీ చేయడమో.. వేతనం, పింఛన్లలో చిన్నపాటి కోతలు వేయడంతోనే సరిపెడుతున్నార''ని ఆ కథనంలో తెలిపారు.

కోడి కాలికి కట్టిన కత్తి Image copyright Getty Images

కోడిపందేలలో విషాదం... పుంజు కాలికి కడుతున్న కత్తి తాకి వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడి పందేల్లో ఓ వ్యక్తికి కోడికత్తి తగిలి మృతిచెందారని 'ఈనాడు' కథనం తెలిపింది.

''పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం సమీపంలోని పామాయిల్ తోటలో కోడిపందేలు నిర్వహించారు. కోడి కాళ్లకు కత్తులు కడుతుండగా సరిపల్లి వెంకటేశ్వరరావు(55) అనే వ్యక్తి అక్కడ నిల్చున్నారు.

ఈ క్రమంలో కోడిపుంజు ఒక్కసారిగా కాళ్లు విదల్చడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు తొడ భాగంలో కత్తి గుచ్చుకుంది. బాగా రక్తస్రావం జరగడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు.

అక్కడున్నవారు వెంటనే స్పందించి వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వెంకటేశ్వరరాను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు చెప్పార''ని ఆ కథనంలో ఉంది.

Image copyright Getty Images

పసుపు ప్రమోషన్‌ హబ్‌: కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

తెలంగాణలో పసుపు ప్రమోషన్‌ హబ్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని 'సాక్షి' కథనం తెలిపింది.

''నిజామాబాద్‌ కేంద్రంగా సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ ప్రమోషన్‌ హబ్‌ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని రకాల సుగంధ ద్రవ్యాల అభివృద్ధి, మార్కెటింగ్‌ కోసం బోర్డు తరహాలో పూర్తి అధికారాలతో కూడిన ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. టీఐఈఎస్‌ పథకం కింద ద్రవ్యాల మార్కెటింగ్ హబ్ కోసం మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించనుంది. కాగా మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కుమార్తె కవిత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంలో పసుపు రైతులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని సుమారు 178మంది మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్‌ వేసి.. కవిత ఓటమే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో వారికి అనూహ్యంగా 90 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ కవితపై 68వేల పైచిలుకు మెజార్టీతో నిజామాబాద్‌ ఎంపీగా గెలుపొందారు. తాజాగా తెలంగాణలో పసుపు ప్రమోషన్‌ హబ్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గమనార్హ''మని ఆ కథనంలో వివరించారు.

Image copyright janasena party
చిత్రం శీర్షిక జేపీ నడ్డా, పవన్ కల్యాణ్

నేడు జనసేన, బీజేపీ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోందని, రాష్ట్రంలో రాజకీయపరిణామాలు వేగంగా మారుతున్నాయని, గురువారం జనసేన, బీజేపీ నేతల సమావేశం విజయవాడలో జరగనుందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''బీజేపీ, జనసేనలు ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక అవగాహనకు వస్తుండడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా రాజధాని ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది.

29 గ్రామాలకే పరిమితమైందనుకున్న ఉద్యమం.. తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు కోస్తా, రాయలసీమ జిల్లాలకు విస్తరిస్తోంది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉండొచ్చునేమో అని సీఎం జగన్ ప్రకటన చేసిన వెంటనే ఏపీలో తొలిసారిగా బీజేపీ స్పందించింది.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ మొదటి నుంచి బీజేపీ ఒకే మాటపై ఉందని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామన్నారు. సీఎం మారినప్పుడల్లా రాజధాని మారడం..రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదన్నార''ని ఆ కథనంలో తెలిపారు.

Image copyright Instagram/hegdepooja

పూజా హెగ్డేని కలిసేందుకు 5 రోజులు ఫుట్ పాత్ పైనే..

సినీ హీరోయిన్ పూజా హెగ్డేకు వీరాభిమాని ఒకరు ఆమె కోసం ముంబయిలో అయిదు రోజుల పాటు పడిగాపులు కాశారంటూ 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''సినిమా స్టార్లపై కొంతమందికి ఉండే అభిమానమే వేరు. నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే తమ అభిమాన నటీనటులను కలుసుకోవాలని ఫ్యాన్స్ తెగ ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కోసారి అభిమానం కూడా ఫీక్ స్టేజ్ లోకి వెళ్తుందంటే అతిశయోక్తి కాదు.

భాస్కర్ రావు అనే వీరాభిమాని చేసిన పనే దీనికి ఉదాహరణ. భాస్కర్ రావుకు పూజాహెగ్డే అంటే చచ్చేంత అభిమానం. ఆమెను ఎలాగైనా కలవాలని పూజా కోసం ముంబయి వచ్చి ఏకంగా ఐదు రోజులు రోడ్డుపైనే పడిగాపులు కాశాడు.

చలిని లెక్కచేయకుండా ఫుట్ పాత్ పైనే పడుకున్నాడు.

పూజా హెగ్డే ఈ విషయం తెలుసుకుని భాస్కర్ రావు వద్దకు వెళ్లింది. 'నీ వీరాభిమానం నా మనస్సును తాకింది. కానీ నా అభిమాని నా కోసం ఇలా రోడ్లపై ఉంటూ, నిద్రపోవడం సరికాదు. నన్ను కలిసేందుకు ఇంత కష్టపడటం చాలా బాధగా అనిపిస్తోంది' అని అన్నారు.

'నువ్వు ఎక్కడున్నా నీ ప్రేమను ఫీలవుతా. నీకు హామీనిస్తున్నా ఫ్యాన్సే నా బలం' అంటూ బాధను చూపించే ఎమోజీలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. భాస్కర్ రావుతో మాట్లాడి పూజా అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..

అడవిలో తప్పిపోయి, 34 రోజులపాటు బెర్రీలు తింటూ ప్రాణాలు నిలబెట్టుకున్న తల్లీ పిల్లలు

కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...

నెలకు రూ.7 వేల వేతనం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న రైతు కూలీలు

అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు

కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు

ఆఫ్రికా: ప్రధాని భార్య హత్య మిస్టరీ... ఆరోపణల్లో కూరుకుపోయిన ప్రధాని థామస్, ఆయన రెండో భార్య

ఎయిర్ ఇండియా: రూ. 22,863 కోట్ల రుణ భారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం