షిరిడీ: సాయిబాబా ‘జన్మస్థలం’ పత్రిపై వెనక్కు తగ్గిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. షిరిడీ సంస్థాన్‌ ట్రస్టుతో సుదీర్ఘంగా చర్చలు - ప్రెస్ రివ్యూ

  • 21 జనవరి 2020
Image copyright Facebook/saibabasansthantrust/UddhavThackeray

మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో ఉన్న పత్రి సాయిబాబా జన్మస్థలమంటూ చేసిన ప్రకటనను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఉపసంహరించుకున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

మహారాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉద్ధవ్, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ షిరిడీ సంస్థాన్‌ ట్రస్ట్‌ సభ్యులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

''పత్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడంపై మీకేమైనా అభ్యంతరాలున్నాయా" అని వారిని ఉద్ధవ్‌ ప్రశ్నించారు. లేవని వారు బదులిచ్చాక, 'సాయి జన్మస్థలం పత్రి' అన్న తన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వెనక్కు తీసుకున్నారు.

సీఎంతో చర్చలపై సంతృప్తి చెందినట్లు షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు.

ఉద్ధవ్‌ ఇటీవల పర్భణీ జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. 'పత్రి'ని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. షిరిడీతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఉద్ధవ్ ప్రకటనపై షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో తాజా చర్చలు జరిగాయి.

Image copyright Twitter/BJP4India
చిత్రం శీర్షిక జేపీ నడ్డాను అభినందిస్తున్ను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే ఆడ్వాణీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా

బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా .. తక్షణ సవాలు దిల్లీ ఎన్నికలే

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సాక్షి తెలిపింది.

జేపీ నడ్డా బీజేపీ 11వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని సోమవారం పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌ సింగ్‌ ప్రకటించారు.

నడ్డాకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొంటున్న అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇతర సీనియర్‌ నేతలు అభినందనలు తెలిపారు.

నడ్డాది హిమాచల్‌ ప్రదేశ్‌. అధ్యక్ష పదవికి ఆయన తరఫున కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ, పలువురు బీజేపీ రాష్ట్ర శాఖల ప్రతినిధులు నామినేషన్లు వేశారు.

నడ్డా తరఫున మాత్రమే నామినేషన్లు దాఖలవడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగానే ముగిసింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించడం కొత్త అధ్యక్షుడిగా నడ్డా ముందున్న తక్షణ సవాలు.

ఇప్పటివరకు విజయం సాధించని రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని సాధించిపెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని నడ్డా చెప్పారు.

బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన నడ్డా అభినందన కార్యక్రమానికి మోదీ, అమిత్ షా, ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఇతర సీనియర్‌ నాయకులు హాజరయ్యారు.

హోం మంత్రిగా అమిత్‌ షా బాధ్యతలు చేపట్టాక 2019 జూన్‌లోనే బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికయ్యారు.

Image copyright Getty Images

రైతుబంధు కింద రూ.5,100 కోట్లు విడుదల

2019-20 సంవత్సరం యాసంగికి సంబంధించి రైతుబంధు పథకం కింద రూ.5,100 కోట్లు నిధులు మంజూరుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసిందని నమస్తే తెలంగాణ తెలిపింది.

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 2019-20లో బడ్జెట్‌లో మొత్తం రూ.12,862 కోట్లు కేటాయించారు.

వానాకాలంలో రూ.6,862 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేసింది.

తాజాగా యాసంగి పెట్టుబడి కోసం రూ.5,100 కోట్లు విడుదలచేస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి ఉత్తర్వులు జారీచేశారు.

సీతారాం ఏచూరి Image copyright FB/ComradeSRY
చిత్రం శీర్షిక సీతారాం ఏచూరి

బెంగాల్ నుంచి ఏచూరిని రాజ్యసభకు పంపే యోచనలో సీపీఎం

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు పంపించాలని పార్టీ యోచిస్తోందని, ఈ విషయంలో కాంగ్రెస్‌ సహకారాన్ని తీసుకోనుందని ఈనాడు తెలిపింది.

ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లోనూ సీపీఎంకు ప్రాతినిధ్యం లేదు.

పశ్చిమ బెంగాల్‌లో ఐదు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.

సంఖ్యాబలం ప్రకారం నాలుగింటిని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీనే మళ్లీ గెలుచుకుంటుంది. ఐదో స్థానానికి సీపీఎం, కాంగ్రెస్‌ల ఉమ్మడి బలం సరిపోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)