తరుగు పేరుతో నిలువు దోపిడీ.. ధాన్యం విక్రయాల్లో రైతులకు రూ. 64 కోట్లు టోపీ - ప్రెస్ రివ్యూ

ధాన్యం

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించిన రైతులకు తీరని నష్టం కలిగిందని.. వ్యాపారులు, దళారుల నుంచి రైతులకు విముక్తి కలిగించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాటిని ఆసరాగా చేసుకొని రైస్‌ మిల్లర్లు తీవ్ర దోపిడీకి పాల్పడ్డారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. సగటున ఒక క్వింటాల్‌ ధాన్యానికి ఏడున్నర కిలోల చొప్పున తరుగు తీసి రైతులకు నష్టం కలిగించారు. ఇలా ఒక బస్తాకు 5 కిలోల చొప్పున తరుగు తీశారు. దీంతో క్వింటాలుకు 7.50 కిలోలు రైతు నష్టపోవాల్సి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కనీస మద్దతు ధర సాధారణ రకానికి ఒక క్వింటాకు రూ.1,815 ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే 9.20 లక్షల మంది రైతులు ఈ ఒక్క ఖరీఫ్‌ సీజన్‌లోనే సుమారు రూ. 64.13 కోట్లు నష్టపోయారు. ఈ లాభాన్నంతా మిల్లర్లే ఆర్జించారు.

పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణకు సంబంధించి కొన్ని నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించింది. తేమ శాతం గరిష్ఠంగా 17కి మించకూడదని, చెత్త తాలూకు 1 శాతం, మట్టిపెళ్లలు, రాళ్లు ఉంటే 1 శాతం, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం ఉంటే 5 శాతం, పూర్తిగా తయారుకాని ముడుచుకుపోయిన ధాన్యానికి 3 శాతం వరకు మినహాయింపులు ఇచ్చింది. వీటికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు తీసేశారు.

వీటికి అదనంగా మళ్లీ రైస్‌ మిల్లర్లు రకరకాల కారణాలతో బస్తాకు 5 కిలోలు తీసేశారు. దీనికితోడు ధాన్యాన్ని కాంటావేసే సమయంలో వే-బ్రిడ్జిలను అడ్డంపెట్టుకొని దోపిడీకి పాల్పడ్డారు.

ఉదాహరణకు జయశంకర్‌ భూపాపల్లి జిల్లాలో ఉమాపతిరెడ్డి అనే రైతు... రైస్‌ మిల్లర్లు సూచించిన వే-బ్రిడ్జి దగ్గర ధాన్యం కాంటా వేయిస్తే 234 క్వింటాళ్లు తూకం వచ్చింది. అదే ధాన్యాన్ని మరో వే-బ్రిడ్జ్‌ వద్ద కాంటా వేయిస్తే 255 క్వింటాళ్ల బరువు ఉంది.

ఒక్క భూపాలపల్లి సెంటర్‌ నుంచే 45 లారీల ధాన్యాన్ని తరలిస్తే, రైస్‌ మిల్లర్లు రూ. 35 లక్షలు ఆర్జించారని నిర్వాహకులు, రైతులు కలిసి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రైస్‌ మిల్లర్లు అన్‌లోడింగ్‌ సమయంలో తీసేసిన 5 కిలోల తరుగుకు సంబంధించిన డబ్బులు కూడా తమ ఖాతాల్లో జమచేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్‌ భయం.. పసిడి ధర పరుగులు.. ఏడేళ్ల గరిష్ట స్థాయి

చైనాలో మొదలై ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌.. ఇన్వెస్టర్లను బంగారంవైపు తిరిగేలా చేస్తోందని.. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పెట్టుబడులకు బంగారమే సురక్షిత మార్గమని వారు భావిస్తున్నారని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సేంజ్‌- నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర బుధవారం ట్రేడింగ్‌ ఒక దశలో 1,614.25 డాలర్లను తాకింది. ఇది ఏడేళ్ల గరిష్టస్థాయి. ఈ వార్త రాసే (రాత్రి 10 గంటల) సమయంలో 1,607 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

కరోనా భయాలతో ప్రపంచ వృద్ధిరేటు పడిపోయే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి పలు ఆర్థిక వ్యవస్థలు ఉద్దీపన చర్యలు చేపడతాయని వస్తున్న వార్తలు కూడా పసిడికి బలంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, ఏడాదిలో పసిడి ధర 21 శాతం (1,277.9 డాలర్లు కనిష్టం) పెరిగింది.

ఫొటో సోర్స్, PTI

దేశంలో 15 ఏళ్ల కనిష్టానికి దిగజారిన పొదుపు

దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రజల పొదుపు ఆలోచనలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని.. చుక్కలనంటుతున్న ధరలు, తగ్గిపోతున్న ఉపాధి అవకాశాల వల్ల కూడా పొదుపు అంతకంతకు పడిపోతూ వస్తోందని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. తాజాగా వెలువడిన గణాంకాల మేరకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ పొదుపు రేటు ఏకంగా 15 ఏళ్ల కనిష్టానికి దిగజారింది. ధరలకు తోడు మన్నికైన వస్తువుల కొనుగోళ్లు, ప్రయాణాలపై ప్రజలు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుండడం కూడా పొదుపును ప్రభావితం చేస్తున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. పొదుపు రేటు పడిపోవడానికి ప్రధాన కారణం కుటుంబ పొదుపు కుంగడమేనని విశ్లేషణలు చెబుతున్నాయి. మొత్తం సేవింగ్స్‌లో దాదాపు 60 శాతం వాటా కుటుంబ పొదుపుదే కావడం విశేషం.

కేంద్రంలో మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పన అమాంతం పడిపోయింది. ముఖ్యంగా ఉపాధి తగ్గడంతో ప్రజల వద్ద విరివిగా నగదు లభ్యత లేకుండా పోతోంది. ఈ అంశం కూడా పొదుపు ఆలోచన స్థాయిని భారీగా దెబ్బతీస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్టుబడులు పడిపోవడం, ఆర్ధిక వ్యవస్థలో బలహీనతలు తారాస్థాయికి చేరుతుండడం కూడా పొదుపు స్థాయిని సన్నగిల్లేలా చేస్తున్నాయని ఒక ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది.

కేంద్ర గణంకాల సంస్థ నివేదిక ప్రకారం 2018-19లో దేశ స్థూల పొదుపు జీడీపీలో 30.1 శాతానికి క్షీణించింది. 2003-04 తరువాత స్థూల పొదుపు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అప్పట్లో దేశ స్థూల పొదుపు జీడీపీలో 29 శాతంగా ఉండేదని కేంద్ర గణాంకాల కార్యాలయం రికార్డులు చెబుతున్నాయి. గరిష్టంగా 2007-08లో దేశ స్థూల పొదుపు జీడీపీలో 36 శాతంగా నిలిచింది.

మరోవైపు కుటుంబ పొదుపు 2012లో 23 శాతంగా నిలవగా.. గత ఏడాది ఇది 18 శాతానికి కుంగింది. భారత పొరుగు దేశం చైనా సేవింగ్స్‌ రేటు మాత్రం దాని జీడీపీలో 46 శాతంగా ఉండడం విశేషం. వినియోగదారుల వినిమయ వ్యయం పెరగడం గృహ పొదుపు పతనానికి కారణమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ.. అది అర్థ సత్యమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సాధారణంగా ప్రజల వినిమయం పెరిగితే తయారీ రంగం పుంజుకోవాలి. కాని అలా జరగడం లేదు. దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ డీలా పడుతూ వస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే ప్రజలు పొదుపు దిశగా ఆలోచించే పరిస్థితులు దూరమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత మందగమనమూ దేశీయ పొదుపు పతనానికి కొంతమేర కారణమేనని హెచ్‌ఎస్‌బీసీ నిపుణులు ప్రంజుల్‌ భండారీ పేర్కొన్నారు. పొదుపు రేటు పడిపోతుండడం ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఫొటో సోర్స్, BAAHUBALI/FACEBOOK

2019లో రూ. 5,613 కోట్లకు బాక్స్‌ ఆఫీస్‌ కలెక్షన్లు

దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నప్పటికీ సినిమా రంగం మాత్రం బాక్స్‌ ఆఫీస్‌ కలెక్షన్లతో కళకళలాడిందని.. గతేడాది విడుదలైన సినిమాలు అత్యధిక వసూళ్లు రాబట్టాయని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. గతేడాది ఏకంగా రూ. 5,613 కోట్ల కనక వర్షం కురిసింది. అంతక్రితం ఏడాది వసూలైన దాంతో పోలిస్తే 27 శాతం అధికమని కేర్‌ రేటింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

సరాసరిగా ఒక్కో సినిమా వసూళ్లు 15 శాతం పెరిగి రూ. 23 కోట్లకు చేరుకోగా, మొత్తం వసూళ్లలో టాప్‌-10 సినిమాల వాటా 42 శాతంగా ఉన్నదని పేర్కొంది.

వీటిలో అవెంజర్‌: ఎండ్‌గేమ్‌ ఒక్క సినిమానే రూ. 373 కోట్ల వసూళ్లు రాబట్టింది. అలాగే 13 సినిమాలు రూ. 100 కోట్ల మార్క్‌ను దాటగా, ఆరు బాలీవుడ్‌ సినిమాలు రూ. 200 కోట్ల మార్క్‌ను దాటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)