'కర్నాటకలో లింగాయత్‌ మఠాధిపతిగా ముస్లిం' - ప్రెస్ రివ్యూ

లింగాయత్

ఫొటో సోర్స్, ANI

కర్నాటకలో ఒక లింగాయత్‌ మఠానికి ఓ ముస్లిం వ్యక్తి అధిపతి అయినట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ వార్త రాసింది.

గడగ్‌ జిల్లాలోని మురుగేంద్ర పౌరనేశ్వర మఠానికి చెందిన గోవింద్‌ భట్‌... బసవేశ్వరుడి బోధనలను విశ్వసించే దివాన్‌ షరీఫ్‌ ముల్లాకు జంధ్యాన్ని ధరింపజేసి మఠం బాధ్యతలను అప్పగించారు.

మఠానికి చెందిన కజురి స్వామిజీ కూడా సంప్రదాయం ప్రకారం ఇష్ట లింగాన్ని దివాన్‌కు అందజేశారు.

చిత్రదుర్గలోని శ్రీజగద్గురు మురుగరాజేంద్ర మఠానికి చెందిన 361 శాఖల్లో గడగ్‌లోని లింగాయత్‌ మఠం ఒకటి.

అక్కడి స్వామీజీల బోధనలకు ఆకర్షితులైన దివాన్‌ షరీఫ్‌ ముల్లా తల్లిదండ్రులు.. ఆ మఠానికి రెండు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. షరీఫ్‌ కూడా మఠం పట్ల ఆకర్షితులై, అందులో చేరారు.

తాను మఠం బాధ్యతలు చేపట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని దివాన్‌ షరీఫ్‌ తెలిపారు. బసవ బోధనలను మరింతంగా ప్రచారం చేస్తానని చెప్పారు.

'నీ కులం, మతం ఏమిటన్నది ప్రధానం కాదు. దేవుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తే మనుషులు సృష్టించిన కులమతాలనేవి అడ్డంకులు కావు' అని శ్రీ మురుగరాజేంద్ర కొరానేశ్వర స్వామి చెప్పారు.

సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడుతున్నవేళ కర్నాటకలో ఈ ఘటన జరుగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గడగ్‌ మఠంలో ఇలాంటివి సాధారణమేనని, గతంలోనూ కొందరు ముస్లింలు జాత్రా కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారని కాంగ్రెస్‌ నేత హెచ్‌కే పాటిల్‌ అన్నారు.

ఫొటో సోర్స్, naralokesh/twitter

మా కుటుంబ నికర ఆస్తులు రూ.102.48 కోట్లు: నారా లోకేశ్

టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ నికర ఆస్తులు రూ.102.48 కోట్లు అని ఆయన కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించినట్లు 'సాక్షి' దినపత్రిక ఓ వార్త రాసింది.

గత ఏడాదితో పోలిస్తే తమ కుటుంబ నికర ఆస్తులు రూ.13.82 కోట్లు పెరిగాయని లోకేశ్ చెప్పారు.

చంద్రబాబు పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ.9 కోట్లు కాగా, ఆయన పేరున రూ.5.13 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఈ లెక్కన చంద్రబాబు పేరిట నికర ఆస్తులు రూ.3.87 కోట్లని, గత ఏడాదితో పోలిస్తే రూ.87 లక్షల నికర ఆస్తులు పెరిగాయని అన్నారు.

చంద్రబాబు భార్య, తన తల్లి భువనేశ్వరి పేరిట మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు, అప్పులు రూ.11.04 కోట్లు ఉన్నాయని లోకేశ్ వివరించారు.

తన పేరిట మొత్తం రూ.24.70 కోట్ల ఆస్తులు, రూ.5.70 కోట్ల అప్పులు ఉన్నాయని.. తన భార్య బ్రాహ్మణి పేరిటి రూ.15.68 కోట్ల ఆస్తులు, రూ.4.17 కోట్ల అప్పులు ఉన్నాయని వివరించారు.

తన కుమారుడు దేవాన్ష్ పేరిట రూ.19.42 కోట్ల ఆస్తులు ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే ఇవి రూ.3.8 కోట్లు పెరిగాయని లోకేశ్ చెప్పారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌లో చంద్రబాబు తన వాటాలోని 26,440 షేర్లను మనవడు దేవాన్ష్‌కు బహుమతిగా ఇచ్చారని ఆయన తెలిపారు.

చంద్రబాబు కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ నిర్వాణ హోల్డింగ్స్‌ అప్పులు రూ.37.20 కోట్ల నుంచి రూ.34.85 కోట్లకు తగ్గినట్టు లోకేశ్‌ వెల్లడించారు. ఆ సంస్థ నికర ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.2.27 కోట్లు పెరిగి, రూ.9.10 కోట్లకు చేరాయన్నారు.

ఫొటో సోర్స్, Twitter/ktrtrs

వేధింపులపై బాలికలు గొంతెత్తాలి: కేటీఆర్

వేధింపులపై బాలికలు గొంతెత్తి చెప్పాలని.. అప్పుడే అలాంటివాటికి ఒడిగట్టేవారు భయపడతారని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

సిరిసిల్ల బాలికల కళాశాల హాస్టల్‌లో లైంగిక వేధింపుల ఘటన దురదృష్టకరమని.. ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టామని కేటీఆర్ చెప్పారు.

ఆ హాస్టల్‌లోని బాలికలతో కేటీఆర్ మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షస్తామని వారికి హామీ ఇచ్చారు.

నిందితుడు తమ పార్టీ నాయకుడేనని తెలియడంతో వెంటనే సస్పెండ్‌ చేసి, అరెస్ట్‌ చేశామని కేటీఆర్ చెప్పారు. మానసికంగా కుంగిపోయిన విద్యార్థినులకు అధికార యంత్రాంగం ధైర్యం చెప్పి.. అండగా నిలిచిందన్నారు. జిల్లాలో ఎక్కడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు.

ఆత్మరక్షణ నిమిత్తం బాలికలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఫొటో సోర్స్, DISHA SOS APP

'మహారాష్ట్రలోనూ దిశ బిల్లు'

ఆంధ్రప్రదేశ్ తరహాలో తమ రాష్ట్రంలోనూ 'దిశ' బిల్లును తీసుకువస్తామని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపినట్లు 'ఈనాడు' దినపత్రిక ఓ వార్త రాసింది.

మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి దర్యాప్తు, విచారణను 21 రోజుల్లోనే పూర్తిచేసి దోషులకు శిక్షపడేలా ఏపీ ప్రభుత్వం 'దిశ' బిల్లును తీసుకురావడాన్ని అనిల్ ప్రశంసించారు.

ఈ తరహాలో తమ రాష్ట్రంలోనూ బిల్లును తెస్తామని, అందుకోసం అవసరమైన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి స్వీకరిస్తామని చెప్పారు.

దిశ బిల్లుపై అధ్యయనానికి ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. మహారాష్ట్ర డీజీపీ సుభోద్‌ జైస్వాల్‌, అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

వెలగపూడి సచివాలయంలో మంత్రులు సుచరిత, తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులతో మహారాష్ట్ర బృందం భేటీ అయ్యింది.

అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ.. దిశ బిల్లును ప్రవేశపెట్టిన రెండు నెలల్లోనే దిశ పేరిట ప్రత్యేక పోలీసుస్టేషన్లను ప్రారంభించటం అభినందనీయమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)