చిరంజీవి సినిమాలో మహేశ్‌ బాబు కీలక పాత్ర - ప్రెస్ రివ్యూ

మహేశ్‌బాబు, చిరంజీవి

ఫొటో సోర్స్, @fans_hyderabad

చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమాలో మహేశ్‌ బాబు ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని.. ఈ కలయిక అటు మెగా అభిమానులకు, ఇటు మహేశ్‌, కృష్ణ ఫ్యాన్స్‌కు పెద్ద పండుగేనని ‘ప్రజాశక్తి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆచార్య' అనే టైటిల్‌ పెట్టే యోచనలో ఉన్న ఈ సినిమాలో మహేశ్‌ బాబు అతిథి పాత్రలోనూ, సినిమాకు కీలకమైన క్యారెక్టర్‌ పోషించబోతున్నట్లు తెలిసింది.

ఇటీవలే మహేశ్‌బాబును కొరటాల శివ కలసి ఈ విషయం చెప్పాడట. ఈ సినిమా కథ, అందులో ఆయన పాత్రను వివరించాడట. చాలా పవర్‌ఫుల్‌గా ఉండే ఆ పాత్ర గురించి విని మహేశ్‌ చాలా ఎగ్జయిట్‌ అయ్యాడట. వెంటనే చిరు చిత్రంలో చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చాడట. త్వరలోనే ఇతనకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారట.

కొరటాల శివ, మహేశ్‌ బాబు మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 'శ్రీమంతుడు', 'భరత్‌ అనే నేను' వచ్చాయి. బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి. అందులో చిరంజీవి అంటే మహేశ్‌బాబు మంచి గౌరవం ఇస్తారు.

ఆ విషయం 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్‌ వేడుకలోనే అందరికీ అర్థమైంది. ఈ బంధమే చిరంజీవి సినిమాలో చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే మహేశ్‌ నిర్ణయం ప్రకటించడానికి కారణమైంది.

ఫొటో సోర్స్, AFP

రూ. 2000 నోట్లు.. మార్చి 1 నుంచి ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో బంద్‌

రెండు వేల రూపాయల నోటును రద్దు చేస్తారంటూ కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలను.. తాజాగా ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయం బలపరుస్తోందని 'నవ తెలంగాణ' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఇక నుంచి తమ ఏటీఎంలలో రూ. 2,000 నోట్లు లభ్యం కావని ఇండియన్ బ్యాంకు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తన ఉద్యోగులకు, ఇతర అధికారులకు రూ. 2,000 నోట్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది.

ఏటీఎంలలో రూ. 2,000 నోట్లను ఉంచవద్దని సంబంధిత శాఖలకు తెలియజేసింది. వచ్చే నెల 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో ఇండియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలలో ఇక రూ.2000 నోట్లు కనిపించే అవకాశం లేదు. రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే యథావిధిగా లభ్యమవుతాయి.

ఈ నిర్ణయం మీద ఇండియన్‌ బ్యాంక్ స్పందిస్తూ.. ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేటప్పుడు రూ. 2,000 నోట్లు రావడం వల్ల బ్యాంక్‌ ఖాతాదారులకు చిల్లర సమస్య వస్తుందని, తమ కస్టమర్ల ఇబ్బందులను తొలగించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

వాస్తవానికి రెండువేల నోటును ప్రయోగాత్మకంగా ప్రభుత్వ బాంకు నుంచి తొలగిస్తే ఎలా ఉంటుందన్న కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్షన్‌ను ఇండియన్‌ బ్యాంక్ అమలు చేస్తోందని మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

యాచక రహిత నగరంగా హైదరాబాద్.. కేంద్ర పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక

హైదరాబాద్ నగరం త్వరలోనే బెగ్గర్‌ ఫ్రీ సిటీగా మారనున్నదని.. యాచక రహిత నగర పైలట్‌ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ఎంపిక చేసిందని.. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. యాచకులకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించి వారు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. వారి ఉత్పత్తులకు మార్కెట్‌తో అనుసంధానం చేయడమే కాకుండా వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు.

టూరిజం ప్లాజాలో శనివారం జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల అధికారులతో పాటు ఎన్జీవోలు సంయుక్తంగా యాచకుల పునరావాసంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పది నగరాలను భిక్షాటన రహితంగా తీర్చిదిద్దేందుకు పైలెట్‌ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నామని, దీనికి అవసరమైన కార్యప్రణాళికను సిద్ధం చేశామన్నారు. యాచకుల పునరావాసానికి కేంద్రం రూ. 10 కోట్లు విడుదల చేస్తుందన్నారు. తాను 25 ఏళ్ల కిందట హైదరాబాద్‌ కలెక్టర్‌గా పనిచేశానని, అప్పట్లో ఇక్కడ మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉండేదని, కానీ నేడు ఉత్తమ నగరంగా గుర్తింపు పొందిందని ప్రశంసించారు.

ఫొటో సోర్స్, @sunny_singer11

బూట్ పాలిష్ వాలా.. ఇప్పుడు ఇండియన్ ఐడల్

సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 11వ సీజన్‌లో సన్నీ హిందుస్తానీ విజేతగా నిలిచినట్లు ‘వెలుగు’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. గత ఏడాది అక్టోబర్‌లో మొదలైన ఈ పోటీలో మొదట్నుంచీ సన్నీ తన ఆధిపత్యం చాటాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో రోహిత్ రౌత్ (లాతూర్), రిధమ్ కల్యాణ్ (అమృత్‌సర్‌)లతో పోటీపడి విజేతగా నిలిచాడు.

ఇండియన్ ఐడల్‌గా నిలిచిన సన్నీ రూ. 25 లక్షల నగదు బహుమతి, కారు గెలుచుకున్నారు. టీ సిరీస్‌లో వచ్చే సినిమాలో పాట పాడే అవకాశమూ లభించింది.

పంజాబ్‌లోని భటిండాకు చెందిన 21 ఏళ్ల సన్నీ.. రైల్వే స్టేషన్‌లో షూ పాలిష్ చేసేవాడు. ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. పాకిస్తాన్‌లోని ప్రముఖ గాయకుడు నుస్రత్ ఫతే అలీఖాన్‌ నుంచి ప్రేరణ పొంది పాడటం మొదలుపెట్టాడు. తన తల్లి బెలూన్లు అమ్మి, ఇంటింటికి తిరిగి బియ్యం అడుక్కుని కుటుంబాన్ని పోషించేదని సన్నీ గుర్తుచేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)