ఏపీలో పోక్సో కింద తొలి మరణశిక్ష.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో తీర్పు - ప్రెస్ రివ్యూ

ఉరిశిక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో పోక్సో చట్టం కింద తొలిసారి ఓ దోషికి మరణ శిక్ష పడిందంటూ సాక్షి దినపత్రిక ఓ వార్త రాసింది.

ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన మహహ్మద్ రఫీ (25)కి చిత్తూరులోని న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది.

పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్న పిల్లల పరిరక్షణ) న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్‌చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి సోమవారం ఈ తీర్పునిచ్చారు.

బి.కొత్తకోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి గతేడాది నవంబర్‌ 7వ తేదీ రాత్రి కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీలో జరిగిన ఓ వివాహానికి తల్లిదండ్రులతో కలసి వచ్చింది.

అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆడుకుంటూ ఒంటరిగా కన్పించిన బాలికను మదనపల్లెలోని బసినికొండకు చెందిన లారీడ్రైవర్‌ మహ్మద్‌ రఫీ (25) ఐస్‌క్రీమ్‌ ఆశ చూపించి కల్యాణమండపంలో ఉన్న బాత్‌రూమ్‌కు తీసుకెళ్లాడు.

పాప అరవకుండా గట్టిగా నోరు మూసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత గొంతునులిమి చంపేశాడు. మృతదేహాన్ని కల్యాణ మండపం పక్కన పడేసి వెళ్లిపోయాడు.

రాత్రంతా పాప కోసం గాలించిన తల్లిదండ్రులు మరుసటిరోజు తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు కల్యాణ మండపం ప్రహరీ పక్కనున్న ఓ గుంతలో పాప మృతదేహం లభించింది.

అక్కడి సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని రూపొందించి సమీప ప్రాంతాల్లోని ప్రజలను విచారించగా రఫీ ఘాతుకం బట్టబయలయ్యింది. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పరారీలో ఉన్న రఫీని పట్టుకుంది.

రఫీ తన 15వ ఏటే ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడని, ఆ కేసుకు సంబంధించి కొన్నాళ్లు జువైనల్‌ హోమ్‌లో కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, kishanreddybjp/twitter

సీఏఏపై కేసీఆర్‌కు సొంత అభిప్రాయం లేదు: కిషన్ రెడ్డి

సీఏఏపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సొంత అభిప్రాయం లేదని, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఆదేశాలను తూచా తప్పకుండా ఆయన పాటిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్త రాసింది.

దేశంలోని 130 కోట్ల మందిలో ఏ ఒక్కరికీ సీఏఏ వల్ల నష్టం లేనప్పుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్‌ ఎందుకు తీర్మానం చేసిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

సీఏఏపై అభ్యంతరాలుంటే కేంద్రం దృష్టికి తీసుకురావాలని, దుష్ప్రచారం చేయొద్దని కోరారు. సీఏఏలో మార్పులు, చేర్పులు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

మార్చి 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఎల్బీ స్టేడియంలో సీఏఏకు అనుకూలంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని, ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, ANDRAPRADESHCM/FB

ఫొటో క్యాప్షన్,

పాత చిత్రం

‘ఆ ఉద్యోగాలు వద్దనుకుంటే, ప్రభుత్వానికి పైకం కట్టాల్సిందే’

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు వాటిని వదిలేయాలంటే వారి శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చును, మూడు నెలల వేతనాన్ని వెనక్కి ఇచ్చేయాల్సి వస్తోందని ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.10 లక్షలకుపైగా ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. నిర్వహించాల్సిన బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.

సచివాలయాల్లో కొలువులకు ఎంపికైన వారిలో అత్యధికులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ), ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన వారితోపాటు ఇతర పోటీ పరీక్షలకు అప్పటికే హాజరైన వారు, పరీక్షలు రాసేందుకు సిద్ధమైన వారే ఉన్నారు. వీరిలో కొందరు మెరుగైన ఉద్యోగాలకు ఇప్పుడిప్పుడే ఎంపికవుతున్నారు.

ఇలాంటి వారంతా రాజీనామాలు చేసి బయటకు వెళ్లాలంటే ఇంతవరకు శిక్షణ నిమిత్తం ప్రభుత్వం చేసిన ఖర్చు, మూడు నెలల వేతనం డబ్బు తిరిగి చెల్లించాలని జిల్లా యంత్రాంగం నుంచి ఆదేశాలు వస్తున్నాయి.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ సి.మహేశ్వరరెడ్డి రైల్వేలో ఉద్యోగం వచ్చిందని ఫిబ్రవరి 6న రాజీనామా చేశారు. ఆయన శిక్షణ కోసం ఖర్చు చేసిన రూ.2 వేలు, 3 నెలల 25 రోజులకు చెల్లించిన వేతనం రూ.57,095 తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయించాక సంబంధిత చలానా వివరాలతో తదుపరి ఆమోదం కోసం జిల్లా పంచాయతీ అధికారికి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయం లేఖ రాసింది.

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తబగ్గం, గంట్యాడ మండలం కొర్లాం గ్రామ సచివాలయాల్లో ఇద్దరు డిజిటల్‌ అసిస్టెంట్లు... మెరుగైన ఉద్యోగాలు వచ్చాయని రాజీనామాలు చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారి సంబంధిత ఎంపీడీవోలకు ఇటీవల లేఖ రాస్తూ ఉద్యోగానికి రాజీనామాలు చేసిన ఇద్దరూ ఇప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలు, ఇతర అలవెన్సులు సంబంధిత శాఖలకు జమ చేశాకే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాజీనామా చేస్తే అప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలు, ఇతర అలవెన్సులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ నియామక ప్రకటన (నోటిఫికేషన్‌)లో పేర్కొన్నా.. అమలుకు సంబంధించి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలివ్వలేదని అధికారులు చెబుతున్నారు.

రాజీనామాలపై స్పష్టత కావాలంటూ జిల్లాల నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ అందలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. జీతభత్యాలు, ఇతర అలవెన్సులు విధిగా వసూలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలివ్వలేదని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)