బంగారం ధర ఒక్క రోజులోనే రూ.1000 తగ్గింది - ప్రెస్ రివ్యూ

బంగారం ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఒక్క రోజులోనే రూ.1000 తగ్గిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడం, డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ 13 పైసలు వరకు బలపడటంతో ఒక్క రోజులోనే బంగారం వెయ్యి రూపాయలు తగ్గిందని ఈనాడు పేర్కొన్న కథనం వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి సమయానికి 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.44,110 రూపాయలు ఉండగా, ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల ధర రూ.40,950 పలుకుతోంది. విక్రయశాలల్లో కూడా బంగారం ధరల్లో ఉదయానికి సాయంత్రానికి భారీ తేడాలుంటున్నాయి.

నిజానికి గతంలో ఉదయం ధర ప్రకటిస్తే రోజంతా అదే ధర కొనసాగేది. స్థానిక వ్యాపారుల సంఘం నిర్ణయించిన ధరల్నే కొనసాగించేవారు. కానీ ధరల్లో ఇప్పుడు గంట గంటకు మార్పులు వస్తుండటంతో ట్రేడింగ్‌కు అనుగుణంగానే బంగారం దుకాణాల్లో కూడా రోజులో రెండు మూడుసార్లు ధరలు మారుస్తున్నట్లు దేశంలో వివిధ ప్రాంతాల్లో బంగారం దుకాణాలు నిర్వహిస్తున్న వర్తకులు చెబుతున్నారు. కిలో వెండి ధర కూడా వెయ్యి రూపాయల వరకు తగ్గింది.

ఫొటో సోర్స్, YSRCP

ఫొటో క్యాప్షన్,

వైసీపీలో రాజ్యసభ ఎన్నికల కోలాహలం

ఏపీ నుంచి రాజ్యసభ రేసులో అయోధ్య రామిరెడ్డి, మస్తాన్ రావు

రాజ్యసభ ఎన్నికల నగారా మోగడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కోలాహలం మొదలైందంటూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

మొత్తం నలుగురు అభ్యర్థులు ఎవరన్నది ప్రకటించేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ నమ్మినబంట్లుగా ఉన్న వారికే అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుటికే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని తాడేపల్లి పిలిపించి మంతనాలు జరిపారు. అభ్యర్థుల జాబితాలోని తొలి వరుసలో "రాంకీ" ఆయోధ్యరామిరెడ్డి పేరున్నట్టు సమాచారం.

ఇదే సమయంలో టీడీపీని వీడి వైసీపీకి వచ్చే సమయంలోనే బీద మస్తాన్ రావుకి రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారంటున్నారు. మాజీ ఎంపీ మేకపాటి కూడా తనకు హామీ ఇచ్చారని చెబుతున్నట్టు పార్టీ వర్గాల అంటున్నాయి.

శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు కూడా ఎమ్మెల్సీలకన్నా ఉన్నత పదవులు ఇస్తానని మంత్రి వర్గ సమావేశంలో జగన్ హామీ ఇచ్చారు. దీంతో వీరు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన అమలాపురం మాజీ ఎంపీ రవీంద్రబాబుకు కూడా రాజ్య సభ ఛాన్స్ దక్కవచ్చని చెబుతున్నారు. అయితే ఎస్సీ వర్గానికి చెందిన మహిళను కూడా పంపవచ్చన్న చర్చ కూడా నడుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలయం కట్టారు

వైఎస్సార్‌కి గుడి కట్టేశారు

చిత్తూరు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలయం ప్రారంభం కానుందంటూ సాక్షి ఓ వార్తను ప్రచురించింది.

తవణంపల్లె మండలం, పట్నం గ్రామంలో నిర్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలయాన్ని మార్చి 1న ప్రారంభించనున్నట్టు ఆలయ నిర్మాత రాజమాణిక్యం తెలిపారు.

ఈ మేరకు చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. రాజమాణిక్యం తన సొంత నిధులు సుమారు రూ.7.5 లక్షలు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఉదయం 10.45 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అత్యంత కాలుష్య రాజధాని దిల్లీ

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని దిల్లీ

ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న 30 నగరాల్లో 21 భారత్‌లోనే ఉన్నాయంటూ నవతెలంగాణ ప్రచురించిన కథనం వివరాలు ఇలా ఉన్నాయి.

2019 -వరల్ట్ ఎయిర్ క్వాలిటీ నివేదిక ప్రకారం అత్యంత వాయు కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఆరు భారత్‌కు చెందినవే ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్ ఈ విషయంలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనాలోని హొటాన్, పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలా, ఫైసలాబాద్‌లు ఉన్నాయి. ఐదో స్థానంలో దిల్లీ ఉంది.

అయితే అత్యంత కాలుష్య రాజధానుల్లో మాత్రం దిల్లీదే అగ్రస్థానం. దేశాల వారీ గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత పాకిస్తాన్, మంగోలియా, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)