చీర కట్టుకుని క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్.. ఎందుకిలా? - ప్రెస్ రివ్యూ

మిథాలీ

ఫొటో సోర్స్, Instagram/mithaliraj

మిథాలీరాజ్ చీర కట్టుకొని క్రికెట్‌ ఆడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారిందని 'ఈనాడు' కథనం తెలిపింది.

''20+ ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌. ఎదుర్కోని ఆటుపోట్లు లేవు. పడని కష్టం లేదు. పురుషుల క్రికెట్‌ నీడలో ఎదిగి దిగ్గజంగా మారింది మిథాలీరాజ్‌. భారత మహిళల క్రికెట్‌ జట్టు సారథిగా ఆమె కీర్తి ఆకాశాన్ని తాకింది. కట్టుబాట్లను దాటి అమ్మాయిల ఆటకు దశ, దిశ చూపించింది. ఖేల్‌ రత్న, పద్మశ్రీ పురస్కారాలను అందుకుంది. కాగా ఆమె చీరకట్టుకొని క్రికెట్‌ ఆడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సాధారణంగా క్రికెట్‌ అంటే జెర్సీ, ప్యాంటు ధరించి ఆడతారని అందరికీ తెలుసు. మరెందుకు మిథాలీ చీరకట్టుకొని ఆడిందనేగా మీ సందేహం.

మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవం. అదే రోజున మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌తో హర్మన్‌ప్రీత్‌ సేన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడనుంది.

తొలిసారిగా టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరుకుంది. ఈ సందర్భంగా మిథాలీతో ఓ ప్రత్యేక వీడియో రూపొందించారు.

కట్టుబాట్లను తెంచుకొని అమ్మాయిలు ఎదుగుతున్నారనేందుకు నిదర్శనంగా చీర కట్టుతో ఆమెను క్రికెట్‌ ఆడించారు.

'టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ను స్వదేశానికి తీసుకురా' అనే సందేశాన్ని జోడించారు'' అని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సికింద్రాబాద్‌లో మాస్కులు ధరించి, చేతులు శుభ్రం చేసుకుంటున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

కరోనా భయంతో హైదరాబాద్ రోడ్లు, బస్సులు, రైళ్లు ఖాళీ

కరోనావైరస్ భయంతో హైదరాబాద్‌లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజల సంచారం బాగా తగ్గిపోయిందని 'ఆంధ్రజ్యోతి' కథనం ప్రచురించింది.

''ఏటా సంక్రాంతి, దసరా పండుగలప్పుడు హైదరాబాద్‌లోని రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి. మరీ ఆ స్థాయిలో కాదుగానీ.. బుధ, గురువారాల్లో రాజధాని నగరంలో రోడ్లపై రద్దీ గణనీయంగా తగ్గింది. చాలా మంది ప్రజలు బయటకు రావడానికి ఆలోచిస్తున్నారు. ఫలితంగా.. నిత్యం రద్దీగా ఉండే రహదారులు, షాపింగ్‌ మాళ్లు, సూపర్‌మార్కెట్లు, హోటళ్లు, సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి.

సూపర్‌మార్కెట్లు, మాల్స్‌లో బిల్లింగ్‌ సెక్షన్ల వద్ద కొనుగోలుదారులు బారులు తీరుతున్న దృశ్యాలు కనిపించట్లేదు. సాధారణ విక్రయాలతో పోలిస్తే.. 10 నుంచి 20 శాతం సేల్స్‌ తగ్గాయని సమాచారం. ఇక.. ఎప్పుడూ కిక్కిరిసిపోయి కనిపించే బస్సుల్లో సైతం ప్రయాణికులు చాలా పల్చగా కనిపిస్తున్నారు. ప్రయాణించిన కొద్దిమందీ కూడా రుమాళ్లు, స్కార్ఫ్‌లు ధరించడం గమనార్హం. నిత్యం కిటకిటలాడే రైళ్లు, రైల్వే స్టేషన్లు కూడా 2-3 రోజులుగా కాస్త పలచగా కనిపిస్తున్నాయి. అటు.. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం జనంతో రద్దీగా ఉండే సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌ నిర్మానుష్యంగా మారింది.

కరోనా వ్యాప్తి భయంతో కార్యాలయాలకు వెళ్లేందుకు ఉద్యోగులు జంకుతున్నారు. అనేక కార్యాలయాలు, వేలాదిమంది ఉద్యోగులు కలిగిన ప్రముఖ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, డెలోయ్‌ట్‌, ఇంటెల్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు 'వర్క్‌ ఫ్రం హోం' వెసులుబాటు ఇవ్వడంతో వారంతా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు'' అని ఆ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, facebook/YS Jagan Mohan Reddy

‘ఏపీలో ఎక్కడా బెల్ట్ షాపన్నది కనిపించకూడదు’

ఏపీలో ఎక్కడా బెల్ట్‌ షాపులు కనిపించకూడదని, అక్రమ మద్యం తయారీ అనేది ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘‘బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా నిరోధంపై గురువారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రొహిబిషన్‌ - ఎక్సైజ్‌ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు. ఇన్ని విప్లవాత్మక కార్యక్రమాల మధ్య బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా లాంటివి మన ఉద్దేశాలను దెబ్బ తీస్తాయన్నారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

నెత్తురోడ్డుతున్న యువత

అభివృద్ధిలో దేశానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన యువత రోడ్డు ప్రమాదాలకు బలవుతూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారని ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది.

‘‘మృతుల్లో 35 ఏళ్లలోపు యువతీ యువకులే అత్యధికంగా ఉటున్నారు. వీరిలో ఎక్కువమంది పట్టపగలే మద్యం మత్తులో అదుపుతప్పి బైకులపై నుంచి కిందపడటం వల్లనే మరణిస్తున్నారు. 1970 నుంచి 2018 వరకు దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలను సమగ్రంగా పరిశీలించి కేంద్ర రోడ్డు భద్రతా సంస్థ విడుదలచేసిన నివేదికలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి.

1970లో దేశవ్యాప్తంగా జరిగిన 1.14 లక్షల ప్రమాదాల్లో దాదాపు 15 వేలమంది మృతిచెందగా 70 వేలమంది గాయపడ్డారు. ఈ సంఖ్యలు ఏటేటా పెరుగుతున్నాయి. 2018లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 4.67 లక్షలకు, మృతుల సంఖ్య 1.51 లక్షలకు చేరింది. ఈ ప్రమాదాల్లో 67 శాతం ద్విచక్ర వాహనాల వల్లనే జరిగాయి. మొత్తం మృతుల్లో యువతీ, యువకులే 74 శాతం ఉన్నారు. 2016లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న 69,851 మంది మృతిచెందగా.. ఈ సంఖ్య 2017లో 73,793కు, 2018 సంవత్సరంలో 72,757కు చేరింది. ప్రమాదాలు ఎక్కువగా వీధుల్లోనే జరుగుతున్నట్లు గుర్తించారు. 2018లో తెలంగాణలోని వీధిరోడ్లలో జరిగిన 14,238 ప్రమాదాల్లో 4,350 మంది చనిపోయారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

నేటి నుంచి అసెంబ్లీ

తెలంగాణ శాసనసభ 15వ సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘‘గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్‌ తొలిసారిగా శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. శనివారం గవర్నర్‌ ప్రసంగంపై ప్రభుత్వం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2020-21ను ఆదివారం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపించనున్నారు. సోమవారం హోలీ కావడంతో సోమ, మంగళవారాలు అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించి తిరిగి బుధవారం నుంచి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

నేటి నుంచి రాజ్యసభ నామినేషన్లు..

తెలంగాణ కోటాలో రాజ్యసభ నుంచి ఏప్రిల్‌ 9న ఇద్దరు సభ్యులు రిటైర్‌ అవుతుండటంతో ఖాళీ అవుతున్న స్థానాలకు శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 18న నామినేషన్ల ప్రక్రియ ముగించి ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో 26న పోలింగ్‌ నిర్వహించడంతోపాటు అదే రోజు సాయంత్రం ఫలితం ప్రకటిస్తారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రక్రియ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)