కేటీఆర్ - పవన్ కల్యాణ్: సర్ ఎందుకు అన్నా.. తమ్ముడూ అను చాలు - ప్రెస్‌రివ్యూ

  • 27 మార్చి 2020
పవన్, కేటీఆర్ Image copyright twitter
చిత్రం శీర్షిక పవన్, కేటీఆర్

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర సంభాషణ నడిచిందని ‘ఈనాడు’ కథనం తెలిపింది.

‘‘కోవిడ్‌-19పై పోరులో భాగంగా పవన్‌ కల్యాణ్‌ విరాళం ప్రకటించడంతో మొదలైందీ సంభాషణ. ‘సర్‌ ఎందుకు... తమ్ముడూ అంటే సరిపోతుంది’ అని కేటీఆర్‌ అనడంతో.. ‘అలాగే’ అంటూ పవన్‌ సమాధానం ఇవ్వడం వరకు సాగింది.

కరోనా (కోవిడ్‌-19) విలయతాండవంతో దేశం మొత్తం లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఈ సమయంలో సహాయార్ధం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెరో రూ. 50 లక్షలు ఇచ్చారు.

ఈ విషయాన్ని ట్వీట్‌ చేస్తే... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్‌ నాయకత్వంలో సమర్థంగా మీ విధులు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు పవన్‌. అందులో కేటీఆర్‌ను సర్‌ అని పవన్‌ సంబోధించారు.

ఆ ట్వీట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ‘‘ధన్యవాదాలు అన్నా.. అయినా మీరు నన్ను సర్‌ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు. నేనెప్పుడూ మీ తమ్ముడినే. అలానే పిలవండి’’ అని కోరారు. దానికి పవన్‌ ‘సరే తమ్ముడూ’ అని రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ట్విటర్‌లో ఈ సంభాషణ హైలైట్‌గా నిలుస్తోంది’’ అని ఆ కథనంలో రాశారు.

Image copyright AP I & PR

పరీక్షల్లేవ్.. అందరూ పాస్

కరోనావైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘‘6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది.

ఈ మేరకు ఆయా సంవత్సరాంత పరీక్షలను రద్దు చేసి, ఆ విద్యార్థులంతా పాస్‌ (ఉత్తీర్ణులు) అయినట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పాఠశాలల్లోని అందరు విద్యార్థులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కరోనావైరస్‌ కారణంగా పరీక్షల వాయిదా తదితర నిర్ణయాలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ దృష్ట్యా స్కూళ్లు మూతపడినందున నేరుగా విద్యార్థుల ఇళ్లకే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం, చిక్కీ, గుడ్ల పంపిణీని సమగ్రంగా అమలు చేయాలని సూచించారు.

అన్ని చోట్లా ఒకే నాణ్యత ఉండాలని, గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకోసం వలంటీర్ల సహాయాన్ని తీసుకోవాలన్నారు’’ అని ఆ కథనంలో తెలిపారు.

Image copyright varanasi.nic.in
చిత్రం శీర్షిక వారణాసి

కాశీలో బిక్కుబిక్కు.. తీర్థయాత్రకెళ్లి చిక్కుకుపోయిన ఆంధ్రులు

తీర్థ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 51 మంది కాశీలో చిక్కుకుపోయారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో ఊరుకాని ఊరిలో నానా కష్టాలు పడుతున్నారు విజయవాడ పటమట హైస్కూల్‌ రోడ్డులోని రామాయణపువారి వీధికి చెందిన 10 మహిళలు.

వీరంతా ఈ నెల 10వ తేదీన రైల్లో కాశీ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణానికి ఈనెల 23న రైలు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈనెల 22న జనతా కర్ఫ్యూ విధించిన కేంద్రం ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో వీరంతా రైలు టికెట్లు రద్దు చేసుకుని, తిరిగి ఏప్రిల్‌ 1వ తేదీకి టికెట్లు బుక్‌ చేసుకున్నారు.

లాక్‌డౌన్‌ను కేంద్రం ఏప్రిల్‌ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో వీరంతా నానా కష్టాలు పడుతున్నారు. నగదు మొత్తం అయిపోవడంతో కాశీలోని తెలుగువారి సత్రంలో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు.

తమను స్వస్థలానికి చేర్చాలంటూ ఫోన్‌ ద్వారా స్థానిక నేతలు, అధికారులు, మంత్రులను వేడుకుంటున్నారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 39 మంది, మరో ఇద్దరు కూడా ఈ నెల 10న కాశీ యాత్రకు వెళ్లి చిక్కుకుపోయారు. తమను ఆదుకోవాలని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ను ఫోన్‌లో కోరారు.

ఒడిశాలో చిక్కుకుపోయిన 175 మంది మత్స్యకారులు

చేపల వేటతోపాటు ఉపాధి కోసం ఒడిశాలోని పారాదీప్‌ హార్బర్‌కు వెళ్లిన 175 మంది మత్స్యకారులు అక్కడ చిక్కుకుపోయారు. వేట ఆగిపోవడంతో పనిలేక, తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. స్వస్థలానికి వద్దామంటే హార్బర్‌ నుంచి అక్కడి అధికారులు కదలనీయడంలేదని మత్స్యకారులు చెబుతున్నారని ఆ కథనంలో వివరించారు.

Image copyright facebook
చిత్రం శీర్షిక అల్లు అర్జున్

అల సూపర్ మార్కెట్లో

‘‘క‌రోనావైర‌స్ నేప‌థ్యంలో చిన్నా, పెద్ద‌, పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఎవ‌రి ప‌ని వారే చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సామాన్యుడిలా మారాడు.

ఇంటి నిత్యావ‌స‌ర వ‌స్తువుల కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ సూప‌ర్‌మార్కెట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. చేతుల‌కు గ్లౌస్‌, ముఖానికి మాస్క్ వేసుకుని స‌రుకులు కొనుగోలు చేశాడు. మాస్క్ వేసుకుని టీష‌ర్ట్‌, షార్ట్‌తో ఉన్న బ‌న్నీని కొంద‌రు గుర్తుప‌ట్టి ఫోటోలు తీశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి’’ అని నమస్తే తెలంగాణ కథనం తెలిపింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: ప్రపంచవ్యాప్తంగా 8,00,000 దాటిన కోవిడ్ బాధితులు, 37,000 దాటిన మృతులు

కరోనావైరస్: వృద్ధులు చేయాల్సిన, చేయకూడని పనులు

కరోనావైరస్‌తో పోరాటం కోసం ఏర్పాటైన PM CARES ఫండ్‌పై ప్రశ్నలు

కరోనావైరస్: భారత సైన్యం రాత్రికి రాత్రే 1,000 పడకల ఆస్పత్రి నిర్మించిందా? ఏది నిజం? - BBC FactCheck

కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం స్పందించే తీరులో వర్ణ వ్యవస్థ ఛాయలు - అభిప్రాయం

కరోనావైరస్‌లో ఏముంది... అది ఎందుకంత ప్రమాదకరం?

కరోనా లాక్‌డౌన్ కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిందా?

కరోనావైరస్‌: తెలంగాణలో దిల్లీ నిజాముద్దీన్ మత కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన ఆరుగురు మృతి

కరోనావైరస్:‌ వేలం వెర్రిగా సాగిన టాయిలెట్ రోల్స్ కొనుగోళ్ళ వెనుక అసలు కథేంటి?