తాచుపాము నుంచి యజమాని ప్రాణాన్ని కాపాడిన శునకం - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ప్రతీకాత్మక చిత్రం
ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ఓ తాచు పాము నుంచి ఓ పెంపుడు కుక్క తన యజమాని ప్రాణాలు కాపాడిందంటూ నవ తెలంగాణ ఓ వార్తను ప్రచురించింది, ఆ వివరాలు ఇవి.
కల్లూరులో ఆర్ఎంపీగా పనిచేస్తున్న కిషోర్ వెనుక గదిలో నిద్రిస్తున్న సమయంలో ఆ గదిలోకి తాచు పాము చేరింది.
ఇంటి వరండాలో ఉన్న శునకం దాన్ని చూసిన వెంటనే అరుస్తూ యజమానిని నిద్రలేపింది. ఆయన లేచే సమయానికి తాచు పాము ఆయన్ను కాటేసేందుకు సిద్ధమవుతుండగా వెంటనే ఆ పాముపై దాడి చేసింది శునకం.
చాలాసేపు పాముతో పోరాడింది. ఆ సమయంలో పాము కుక్కను కాటేసింది. అయినా లెక్కచేయకుండా పామును నోటితోపట్టుకొని బయటికి తీసుకు వచ్చింది.
వెంటనే పామును చంపిన యజమాని అనంతరం తన ప్రాణాల్ని కాపాడిన ఆ శునకాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచింది.
దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయంటూ నవ తెలంగాణ ఈ కథనంలో తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
దేశాన్ని మూడుజోన్లు చేసే యోచనలో కేంద్రం
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి దేశాన్ని 3 జోన్లగా విభజించే యోచనలో కేంద్రం ఉందంటూ ఈనాడు ప్రధాన వార్తగా ప్రచురించింది, ఆ వివరాలు ఇవి.
ఈ ఆలోచనపై ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోంది. నమోదైన కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా గుర్తించాలని భావిస్తోంది.
ఏప్రిల్ 15 తర్వాత మరో 2 వారాల పాటు కోవిడ్-19ను దీటుగా ఎదుర్కొనేందుకు ఇది ఉపకరిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
రెడ్ జోన్: కరోనావైరస్ కేసులు 15 కన్నా ఎక్కువ నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటిస్తారు. ఇలా ప్రకటించిన జోన్లలో ఏప్రిల్ 14 తర్వాత కూడా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయి. అన్ని రకాల కార్యకలాపాలపైనా నిషేధం ఉంటుంది. ప్రజలు పూర్తిగా ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది.
ఆరెంజ్ జోన్: 15 కన్నా తక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో పరిమిత కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి కొన్ని సర్వీసులను నడపటం, వ్యవసాయ పనులకు అనుమతులు ఉంటాయి.
గ్రీన్ జోన్: ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా గుర్తిస్తారు. గ్రీన్ జోన్ల పరిధిలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
అలాగే లాక్ డౌన్ అమలులో ఉంటే ఆంక్షల నుంచి ఏఏ రంగాలను మినహాయించాలన్నదానిపై కూడా కేంద్రం కసరత్తు చేస్తోందని ఈనాడు ఈ కథనంలో వివరించింది.
ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా
రాష్ట్రంలో నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగింపుతో మేలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు (సెట్స్) వాయిదా పడ్డాయంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో కరనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా లాక్ డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
ఈ పరిస్థితుల్లో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత నూతన షెడ్యూల్‌ను జారీ చేస్తామని చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.
ప్రవేశ పరీక్షలను వాయిదా వేయడంతో దరఖాస్తు గడువును మే 5 వరకు పొడిగించారు. పలు కోర్సుల్లో ప్రవేశానికి ఎనిమిది సెట్స్‌ను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తోంది.
షెడ్యూల్ ప్రకారం ఈ ప్రవేశ పరీక్షలను మే నెలలో నిర్వహించాల్సి ఉంది. అయితే లాక్డౌన్ పొడిగింపుతో ప్రవేశ పరీక్షల వాయిదా అనివార్యమైందని ఆంధ్రజ్యోతి ఈ కథనంలో తెలిపింది.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు
తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగు నీటి కష్టాలను శాశ్వతంగా తొలగించేలా వాటర్ గ్రిడ్ పథకాన్ని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందంటూ సాక్షి దిన పత్రిక ప్రధాన వార్తగా ప్రచురించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతి: కాంట్రాక్టరుకు నిర్మాణ వ్యయంలో నామమాత్రం మొత్తాన్ని ఇప్పుడు చెల్లించి మిగిలింది సాధారణ బ్యాంకు వడ్డీతోగానీ అంతకంటే తక్కువ వడ్డీరేటుతో గానీ లెక్కకట్టి 10–12 ఏళ్ల పాటు చెల్లించడం.
భారీ వాటర్ గ్రిడ్: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటిని అందించేందుకు వీలుగా భారీ వాటర్ గ్రిడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.
భూగర్భ జల సంరక్షణ: కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం తలపెట్టింది. అంతేకాక, ఫ్లోరైడ్ వంటి సమస్యను పరిష్కరించడంతోపాటు తీర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు ఉప్పునీరు కాకుండా కాపాడినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు.
తొలి విడతలో భాగంగా తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలతో కలిపి మొత్తం ఆరు జిల్లాల్లో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు.
ఇందులో శ్రీకాకుళం, ఉభయ గోదావరి, ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సాక్షి ఈ కథనంలో వివరించింది.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ లాక్డౌన్: కర్ఫ్యూ పాస్ చూపించమన్నందుకు కత్తులతో దాడి... తెగిపడిన ఒక పోలీసు అధికారి చేయి
- కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
- కరోనావైరస్: సామాజిక దూరం, స్వీయ నిర్బంధం అంటే ఏంటి? ఎవరిని ఒంటరిగా ఉంచాలి?
- కరోనావైరస్: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయి-ధారావిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేదెలా?
- కరోనా లాక్డౌన్: ఈ కార్మికుడు భార్యను ఎక్కించుకుని సైకిల్‌పై 750 కిలోమీటర్లు ప్రయాణించాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)