కరోనావైరస్: "అన్ని ప్రశ్నలకు ఒకే పిటిషన్లో సమాధానం ఇవ్వలేం" - ప్రధాని కార్యాలయం - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, PTI
కోవిడ్-19 నియంత్రణలో భాగంగా ప్రజలకు వైద్య సదుపాయం అందించడానికి ఏర్పాటుచేసిన పీఎం-కేర్స్ వివరాలను ఇవ్వడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నిరాకరించిందని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. పీఎం కేర్స్ నిధికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలని, కోవిడ్-19 కట్టడికి గానూ కేంద్రం విధించిన లాక్డౌన్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి సమీక్షల్లో పాల్గొంటున్న వ్యక్తులు, అందులో చర్చిస్తున్న విషయాలను వెల్లడించాలని నోయిడాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త, పర్యావరణవేత్త విక్రాంత్ తోగడ్ గత నెల 21న పిటిషన్ దాఖలుచేశారు.
ఆరు రోజుల తర్వాత పీఎంవో స్పందిస్తూ ఆ సమాచారాన్ని అందించలేమని తెలిపింది. ఇదే విషయమై పీఎంవో స్పందిస్తూ.. 'ఈ అభ్యర్థనలను విడిగా పరిగణించి తదనుగుణంగా ఫీజులు చెల్లిస్తే తప్ప ఒకే పిటిషన్లో ఇన్ని అభ్యర్థనలకు సమాధానం అందించబోం' అని తెలిపింది.
ఆర్టీఐ చట్టం ప్రకారం కూడా ఒక దరఖాస్తుదారుడి ఇన్ని అభ్యర్థనలకు సమాధానం ఒకే పిటిషన్లో తెలపలేమని పీఎంవో స్పష్టం చేసింది. ఇందుకు గానూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పును ఉటంకించింది. 2016లో 'సీబీఎస్ఈ అండ్ అదర్స్ వర్సెస్ ఆదిత్యా బంధోపాధ్యాయ అండ్ అదర్స్' కేసులో తీర్పును జతపరిచింది. అంతేగాక 2009లో రాజేంద్రసింగ్ వర్సెస్ సీబీఐ హెడ్‌క్వార్టర్స్ తీర్పునూ అందులో చేర్చుతూ సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించింది.
ఆర్టీఐ కార్యకర్త రాజేంద్ర సింగ్ వర్సెస్ సీబీఐ హెడ్‌క్వార్టర్స్ కేసులో.. సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో 69 విషయాల మీద సమాచారం కోరుతూ పిటిషన్ దారుడు అభ్యర్థన పెట్టుకున్నాడు. కేంద్ర సమాచార శాఖ (సీపీఐవో) దాన్ని సంబంధిత కార్యాలయానికి పంపింది.
వివిధ ప్రశ్నలు ఉన్నందున ఒక్కోదానికి రూ. 10 చొప్పున చెల్లించాలని సీపీఐవో దరఖాస్తుదారుడికి తెలిపింది. దానికి రాజేంద్ర సింగ్ నిరాకరించారు. ఈ విషయం నాటి సమాచార కమిషనర్ వజహత్ హబీబుల్లా దాకా చేరగా.. ఆయన దీని మీద విచారణ చేపట్టారు. పిటిషన్‌దారుడు కోరిన విషయాలన్నీ ఒకే అంశానికి సంబంధించినవనీ, ఒక్కటి మాత్రమే వేరే ఉన్నదనీ, దానికి మాత్రం రూ. 10 చెల్లిస్తే సరిపోతుందని తీర్పునిస్తూ ఆయనకు సమాచారం అందించారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో రేపటి నుంచి మద్యం విక్రయాలు
ఆంధ్రప్రదేశ్‌లో లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడంతో 4వ తేదీ నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. మద్యం విక్రయాల ప్రారంభంపై శనివారం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అయితే మద్యం షాపులు మాత్రమే తెరవనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిపేలా ఏర్పాట్లు చేయనున్నారు.
లాక్డౌన్ పూర్తయ్యే వరకూ బార్లకు మాత్రం అనుమతి లేదు. కాగా జోన్ల విషయంలో దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటే ఐదు జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నందున అక్కడ అమ్మకాలు జరగవు. మండలాలను యూనిట్‌గా తీసుకుంటే అన్ని జిల్లాల్లోనూ రెడ్ జోన్ మండలాలను మినహాయించి మిగిలిన మండలాల్లో మద్యం విక్రయించే అవకాశముంది.
ఫొటో సోర్స్, Getty Images
భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర
వంట గ్యాస్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించిందని, నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను భారీగా తగ్గించాయని ‘సాక్షి’ ఓ కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. వివిధ మెట్రో నగరాల్లో సవరించిన రేట్లు మే 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇది వరుసగా మూడో తగ్గింపు.
హైదరాబాద్‌లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.207 తగ్గి రూ.589.50 నుంచి ప్రారంభమవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.336 క్షీణించి ప్రారంభ ధర రూ.988కి చేరింది.
దిల్లీలో ఎల్పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర 744 నుంచి తగ్గి రూ. 581.50 గా ఉంటుంది. ముంబైలో 714.50 తో పోలిస్తే తాజాగా రూ. 579 ఖర్చవుతుంది. కోల్‌కతాలో రూ. 190 తగ్గి రూ. 584.50, చెన్నైలో రూ. 569.50 ధరకు విక్రయించనున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ వుంటాయి.
ఫొటో సోర్స్, TS HIGH COURT
తెలంగాణ హైకోర్టు జడ్జిగా విజయ్‌సేన్ రెడ్డి
తెలంగాణ హైకోర్టు న్యాయవాది బి.విజయ్‌సేన్‌రెడ్డిని తెలంగాణ హైకోర్టు న్యాయముర్తిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. విజయ్‌సేన్ రెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకంతో హైకోర్టు జడ్జిల సంఖ్య 14కు చేరింది.
అలాగే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయముర్తులుగా న్యాయవాదులు బి.కృష్ణమోహన్, కె.సురేశ్‌రెడ్డి, కె.లలితకుమారిలను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి.
- కిమ్ జోంగ్ ఉన్: 20 రోజుల తర్వాత ప్రజలకు కనిపించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు
- కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?
- లాక్డౌన్-3: రెడ్ జోన్లలో ఆంక్షలేమిటి? ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఏమిటి?
- కరోనావైరస్ కేసుల డబ్లింగ్ రేటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంత... కోవిడ్ వ్యాప్తి పెరుగుతోందా, తగ్గుతోందా?
- కరోనావైరస్ లాక్డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'
- కరోనావైరస్ లాక్డౌన్: తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు బయలుదేరిన వలస కార్మికుల తొలి రైలు
- కరోనావైరస్: భారత్‌లో మే 17 వరకు లాక్డౌన్ పొడిగింపు... రెడ్ జోన్లలో మరిన్ని ఆంక్షలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)