మొన్న కేరళలో ఏనుగు, ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆవు.. : ప్రెస్ రివ్యూ

ఆవు

ఫొటో సోర్స్, Getty Images

కేరళలో పేలుడుపదార్థాలున్న పైనాపిల్ తిని ఏనుగు మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌ మరువకముందే ఓ ఆవుకు కూడా అలాగే జ‌రిగిందంటూ ‘సాక్షి’ దిన‌ప‌త్రిక ఓ వార్త ప్ర‌చురించింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ సూడి ఆవు నోట్లో టపాసులు పెట్టి పేల్చడంతో ఆవుకి తీవ్రగాయాలయ్యాయి. నోరంతా రక్తసిక్తమైన ఆవు ఏమీ తినలేక అవస్థపడుతోంది.

ఆవు యజమాని గురు దయాళ్ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. ఆవుపై దాడికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆవు యజమాని కోరారు.

ఈ ఘటనకు తన పొరుగున నివసించే వ్య‌క్తి కారణమని ఆరోపించారు. పది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. యానిమల్‌ క్రూయాలిటీ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేరళలోని పాలక్కాడ్‌లో టపాసులు పెట్టిన పైనాపిల్‌ తినడంతో ఏనుగు కొన్ని రోజులపాటు ఏమీ తినలేక, నొప్పి నుంచి ఉపశమనం కోసం నీటిలోనే ఉండి చనిపోయింది.

ఈ ఘటనతో సంబంధం ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

‘పరీక్షలను పూర్తిగా రద్దు చేసి అంతర్గత మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని భావిస్తున్నారు’

తెలంగాణ‌లో పదో త‌ర‌గ‌తి పరీక్షలు మ‌ళ్లీ వాయిదా

తెలంగాణ‌లో సోమవారం నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిందంటూ ‘ఈనాడు’ దిన‌ప‌త్రిక ఓ వార్త రాసింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు శనివారం స్పష్టం చేసిన నేప‌థ్యంలో... అలా చేస్తే సమస్యలు రావొచ్చని భావించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

మళ్లీ పరీక్షలను నిర్వహించాలా? లేక అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వాలా అన్నది ముఖ్యమంత్రి వద్ద ఆది లేదా సోమవారం జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయానికి రానున్నారు.

అయితే పరీక్షల రద్దుకే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యాశాఖ అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

పరీక్షలను రద్దు చేసి అంతర్గత మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టెన్త్‌ పరీక్షలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి నిర్వహిస్తే ఉపయోగం లేదు. అందరికీ పరీక్షలు పూర్తయితేనే ఇంటర్‌, బాసర ఆర్‌జీయూకేటీ, పాలిటెక్నిక్‌ తదితర ప్రవేశాలకు వీలవుతుంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించకుండా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవమంటే...వారికి ఒక్కసారే అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు రాసే వాళ్లు పరీక్ష ఫెయిలయితే సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వీలవుతుంది.

ఇలా కొందరికి రెండు సార్లు, మరికొందరికి ఒకసారే పరీక్ష రాసే అవకాశం ఇస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయి.

ఒకవేళ జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారికి మరోసారి పరీక్ష నిర్వహించాలంటే బాగా ఆలస్యమవుతుంది. మళ్లీ జవాబుపత్రాల మూల్యాంకనం, ఫలితాల విడుదల తదితర వాటి వల్ల విద్యా సంవత్సరం మీద ప్ర‌భావం ప‌డుతుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

‘తరగతిలో 30 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు విడతలుగా తరగతులు నిర్వహించాలి’

ఏపీలో పాఠశాలలకు సప్త సూత్రాలు

కరోనా వైరస్ వ్యాప్తి‌ దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

2020-21 విద్యా సంవత్సరంలో ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినందున పాఠశాలల యాజమాన్యాలకు చెందిన పాఠశాలలకు ‘సప్త సూత్రా’లను అమలు చేయాలని సూచన‌లు వ‌చ్చాయి.

ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు విడతలుగా తరగతులు నిర్వహించాలని పాఠ‌శాల విద్యాశాఖ‌ తెలిపింది.

సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరుకులు పంపిణీ చేయాలని సూచించింది.

ఆ మార్గదర్శకకాలు ఇవే...

1. పాఠశాలల ఆవరణ : పాఠశాల ఆవరణను క్రిమిసంహారకంగా శుద్ధి చేయాలి. ప్రవేశ ద్వారం వద్ద విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించాలి. 30 మంది పిల్లలకు రెండు చొప్పున ఆటోమేటెడ్‌ చేతులు కడిగే యంత్రాలు ఏర్పాటు చేయాలి. వాషబుల్‌ క్లాత్‌ మాస్క్‌లను విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందించాలి.

2. స్కూలు నిర్వహణ సమయం : పాఠశాల ఆవరణలో ఉదయం నిర్వహించే ప్రార్థన రద్దు. అయితే తరగతి గదిలో మైకుల ద్వారా చేయించుకోవచ్చు. 30 మంది విద్యార్థులకు మించి ఉంటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండు విడతల్లో తరగతులు నిర్వహించాలి. ప్రతిరోజు 15 నిమిషాలు కొవిడ్‌-19 నివారణ చర్యలను వివరించాలి.

3. విద్యార్థుల ఆరోగ్యం కోసం : విటమిన్‌-ఏ కోసం రెగ్యులర్‌గా ఐరన్‌ మరియు ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్లు కొనసాగించాలి. రెండు వారాలకోసారి శనివారం నాడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఆటల పీరియడ్‌ను రద్దు చేయాలి. శనివారం ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ నిర్వహించాలి.

4. మధ్యాహ్న భోజన పథకం : సాధారణ పరిస్థితులు వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరుకులను అందించాలి.

5. పరీక్షల ప్రొటోకాల్‌ : పరీక్షా కేంద్రాల వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించడం తప్పనిసరి. ఒక్కో గదిలో 10 మంది మాత్రమే పరీక్షలకు అనుమతించాలి.

6. స్పాట్‌ వాల్యుయేషన్‌ సెంటర్లు : మూల్యాంకన కేంద్రాలను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి. స్పాట్‌ కేంద్రాల్లో క్రిమిసంహారక మందులు స్ర్పే చేయాలి.

7. లాక్‌డౌన్‌ సూచనలు : స్కూలు పాయింట్‌ వద్దే విద్యార్థులందరికీ వర్క్‌ షీట్లు అందజేయాలి. టీవీల ద్వారా సూచనలకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేయించాలి. వారాంతపు అసైన్‌మెంట్లు నిర్వహించాలి.

ఫొటో క్యాప్షన్,

ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు

‘కూతురే లేదు.. కల్యాణలక్ష్మి వచ్చింది’

మహబూబ్‌నగర్‌లో ఓ వృద్ధురాలికి కూతురు లేకున్నా, కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. లక్ష మంజూరైనట్లు ‘వెలుగు’ దినపత్రిక ఓ వార్త రాసింది.

గండీడ్​ మండలం గాధిర్యాల్​గ్రామానికి చెందిన దేవనోళ్ల ఆనంద్ వివాహం కర్నాటక రాష్ట్రానికి చెందిన లక్ష్మితో 2‌‌‌‌018లో జరిగింది.

పెళ్లికూతురు కర్నాటక రాష్ట్రానికి చెందిన అమ్మాయి కావడంతో తెలంగాణలో కల్యాణలక్ష్మి పథకం వర్తించదని తెలిసి ఓ పైరవీకారుడిని ఆశ్రయించారు. అతడు చేరి సగం ఇస్తే మంజూరు చేయిస్తానని డీల్ కుదుర్చుకున్నాడు.

దీనికి పెళ్లికొడుకు ఆనంద్​ఒప్పుకోవడంతో కర్నాటకకు చెందిన లక్ష్మిని అదే మండలంలోని మొకార్లబాద్ గ్రామానికి చెందిన శీలం భీమమ్మ కూతురిగా సర్టిఫికెట్స్​సృష్టించారు.

కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేశారు. 3 జులై 2019న పథకం డబ్బులు రూ. 1,00,116 భీమమ్మ ఖాతాలో పడ్డాయి.

భీమమ్మకు అసలు కూతుర్లే లేరు. అయినప్పటికీ అంతా కమ్మక్కు కావడంతో పథకం మంజూరైంది. ఖాతాలో డబ్బులు పడగానే పైరవీకారులు ఆమెకు రూ. వెయ్యి ఇచ్చి ఖాతాలోంచి రూ. లక్ష డ్రా చేసుకున్నారు.

కొన్నాళ్ల తర్వాత అనుమానం వచ్చిన ఆనంద్​మేనమామ సిలెం హనుమయ్యను నిలదీయడంతో బుకాయించాడు. దీంతో ఆనంద్​ భీమమ్మ వద్దకు వెళ్లి ఆమె బ్యాంకు అకౌంట్​నంబర్ ​తీసుకుని స్టేట్​మెంట్​తీసుకున్నాడు. అందులో డబ్బులు రూ. లక్ష డ్రా చేసినట్లు ఉంది.

దీంతో 11 నెలలు అవుతున్నా ఇప్పటివరకు తన వాటా ఇవ్వలేదని, ఇప్పించాలని ఆధారాలతో సహా ఓ ప్రజాప్రతినిధిని ఆశ్రయించడంతో విషయం బయటపడింది.

ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గండీడ్​ తహసీల్దార్​ జ్యోతి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)